రాజమండ్రి టీడీపీలో టికెట్ల పంచాయతీ….!

-

ఏపీలో ఎన్నికలకు సమయంలో దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయా పార్టీలు ఎన్నికలపై దృష్టి పెట్టేశాయి. వాస్తవానికి ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలు ప్రచారం కూడా మొదలుపెట్టేశాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ప్రస్తుతం రాజకీయాలు మరింత హాట్‌గా మారాయనేది వాస్తవం. చంద్రబాబు అరెస్టుతో వచ్చిన సానుభూతి తప్పకుండా తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని కూడా అంటున్నారు అధికార పార్టీ నేతలు.

ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజమండ్రి టీడీపీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎలాగైనా గెలవాలని జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ సారి రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంతా భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రస్తుత సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిపై నియోజకవర్గంలో కావాల్సినంత వ్యతిరేకత ఉంది. పైగా ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌పై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. ఆదిరెడ్డి పెత్తనం కారణంగా ఇప్పటికే టీడీపీకి చెందిన సుమారు 15 మంది మాజీ కార్పొరేటర్లు పార్టీ మారిపోయారు. దీంతో ఆదిరెడ్డిని పక్కన పెట్టాలని అధిష్ఠానం భావిస్తోంది.

మరోవైపు ఇప్పటికే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నేతలపై ఆదిరెడ్డి వాసు కస్సుబుస్సు అంటున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు కూడా అవకాశం లేదని తేగేసి చెబుతున్నారు. దీంతో రూరల్ నేతలు ఆదిరెడ్డి వాసు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి… తనకు అవకాశం ఇస్తే సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చివరికి ఈ నెల 2వ తేదీన నారా భువనేశ్వరి చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో ఆదిరెడ్డి వాసు వ్యవహరించిన తీరుపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ మహిళా నేతలను కనీసం వేదికపైకి కూడా రాకుండా వాసు అడ్డుకున్నాడు. చివరికి గోరంట్ల జోక్యం చేసుకోవడంతో రూరల్ మహిళ నేతలు వేదికపైకి వెళ్లారు. ఈ విషయంపై కూడా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు రూరల్ నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version