ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. ప్రతిపక్షాలన్నీ ప్రజాకర్షణ మేనిఫెస్టో రూపొందించాలని వ్యూహరచన చేస్తున్నారు. బిఆర్ఎస్ సంక్షేమ పథకాలలో స్పీడ్ పెంచితే, వాటికి దీటుగా తమ మేనిఫెస్టో ఉండాలని కాంగ్రెస్ ఆలోచనలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ను విజయపథంలో నడిపిన మేనిఫెస్టోతో తెలంగాణలో బిఆర్ఎస్ కి చెక్ పెట్టాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో బిజెపిని ఓడించిన పంచతంత్రాన్ని తెలంగాణలో బిఆర్ఎస్ పై ప్రయోగించాలని కాంగ్రెస్ దృఢ నిశ్చయంతో ఉంది. 17న జరిగే తుక్కుగూడలో జరిగే విజయ భేరి సభలో సోనియా గాంధీ చేతుల మీదుగా ఐదు ప్రధాన హామీల పత్రాన్ని విడుదల చేయించాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. ఐదు గ్యారంటీలు 1.మహిళలకు 500 కే సిలిండర్ 2.మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం 3. రైతులకు 2,00,000 రుణమాఫీ, 4. యువతకు ఉద్యోగాల భర్తీ ,విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పునరుద్దరణ, 5.బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు.
ఈ ఐదు అంశాలకు ప్రాముఖ్యత ఇస్తూ, ఆచరణ యోగ్యమైన హామీలతో మైనారిటీ ,ఆర్థిక మహిళా సాధికారత, సాంస్కృతిక, మతపరమైన సంస్థలు, మైనార్టీల సంక్షేమంమొదలైన 400 అంశాలను పరిశీలిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీనిలో కీలకంగా రూ.4 వేల పెన్షన్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రజలందరూ మెచ్చే మేనిఫెస్టోతో బిఆర్ఎస్ ను గద్దెదించాలని కృత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది .మరి కాంగ్రెస్ పంచతంత్రం తెలంగాణలో పనిచేస్తుందా? లేదా? చూడాల్సిందే?