గడిచిన ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబుకు, ఇప్పుడు ఐదు మాసాలు పాలన పూర్తి చేసుకున్న జగన్ కు మధ్య తేడా ఏమైనా ఉందా? లేక బాబు దారిలోనే జగన్ వెళ్తున్నారా? సోషల్ మీడియాలో ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. గడిచిన ఐదేళ్ల కాలంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. తన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో బాబు నిమగ్నమయ్యారు. తను కాదనుకున్నవారిని ఇబ్బందుల పాలు చేశారనేది కూడా వాస్తవం. ఫలితంగా ఐదేళ్లు పూర్తయిన తర్వాత ఆయన పరిస్థితి ఆయన ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. ఇదీ .. సోషల్ మీడియా చెబుతున్న మాట..!
మరి ఇప్పుడు జగన్ విషయానికి వద్దాం.. ఆయన ఏం చేస్తున్నారు ? బాబు బాటలోనే వెళ్తున్నారని అనే సంఖ్య పెరుగుతోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అయితే, ఈ పథకాలు కేవలం నిరుపేద లకు, పేదలకు సంబంధించిన పథకాలే.. కానీ, సమాజంలో పన్నులు కట్టేవారి సంఖ్య ఎంత ఉంది ? ప‌్రభు త్వానికి ఆదాయం సమకూరుస్తున్న వర్గాలు ఎన్ని ఉన్నాయి? మరి వారికి ఆయన చేకూరుస్తున్న ఉపశాం తులు ఎమైనా ఉన్నాయా ? పేదలకు మేళ్లు చేయవద్దని ఎవరూ అనరు. కానీ, మధ్య తరగతి వర్గానికి ఉద్దేశించి గతంలో చంద్రబాబు కానీ, ఇప్పుడు జగన్ కానీ చేస్తున్నది ఏమీ లేకపోవడంపై చర్చ జరుగుతోంది.
ఉపాధి కల్పనకు సంబంధించిన మార్గాల అన్వేషణ విషయంలో రెండు ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదు. ఇక, మధ్య తరగతి వర్గాలు కోరుతున్న విధంగా గృహ రుణాలు, పారిశ్రామిక రుణాలను ఇచ్చేందుకు కానీ, ఇప్పించేందుకు కానీ చంద్రబాబు చేసిన ప్రయత్నం ఏమీ లేదు. ఇప్పుడు జగన్ చేసింది కూడా ఏమీ లేదు. అదేసమయంలో పెట్రోల్ పై వ్యాట్‌ను కానీ, గ్యాస్‌పై విధిస్తున్న లోకల్ సెస్సును కానీ, తగ్గించడంలో ఏ ప్రభుత్వమూ చర్యలు తీసుకోలేదు. ఈ పరిణామాలతో నూటికి 70% ఉన్న మధ్యతరగతి వర్గాలు ఈ రెండు ప్రభుత్వాల విషయంలోనూ పెదవి విరుస్తున్నాయి. మరి ఇప్పటికైనా జగన్ ఈ విషయంలో చర్యలు తీసుకుంటేనే బెటర్ అంటున్నారు పరిశీలకులు.