మాడుగుల‌లో ఎగిరే జెండా ఎవ‌రిదో……?

-

ప్ర‌ముఖ స్వాతంత్య్ర ప‌మ‌ర‌యోధుడు తెన్నేటి విశ్వ‌నాథంను చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపిన ఘ‌న‌త మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం ఓట‌ర్లు సొంతం చేసుకున్నారు. ఉమ్మడి విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఉంది ఈ నియోజ‌క‌వ‌ర్గం. జిల్లాల‌ పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ప్ర‌స్తుతం అన‌కాప‌ల్లి జిల్లాలో చేరింది మాడుగుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ తొలిసారి 1952లో ఎన్నికలు జరగ్గా భోజింకి గంగ‌య్య‌నాయుడు మొద‌టి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటి వరకు 16సార్లు ఎన్నికలు జరిగాయి. వ‌రుస‌గా ఐదుసార్లు రెడ్డి స‌త్య‌నారాయ‌ణ ఎమ్మెల్యేగా గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయ‌న తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయ‌గా ఆ పార్టీ 6సార్లు ఇక్క‌డ ఓట‌ర్ల ఆద‌ర‌ణ పొందింది.

1952లో జ‌రిగిన‌ తొలి ఎన్నికల్లో కేఎల్పీ నుంచి పోటీ చేసిన బీజీ నాయుడు మాడుగుల ఎమ్మెల్యేగా విజ‌యం సాదించారు. 1955లో పీఎస్సీ అభ్య‌ర్ధి డీఎస్‌ మూర్తి, 1962లో స్వతంత్ర అభ్య‌ర్దిగా పోటీ చేసిన స్వాతంత్య్ర స‌మ‌ర‌యోథులు తెన్నేటి విశ్వనాథం ఒక్క‌డ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇదే ఏడాది ఈ నియోజకవర్గాన్ని రెండుగా విభ‌జించారు. బొడ్డం పేరుతో ఏర్పాటైన నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించగా, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఏ. దశావతారం విజయం సాధించారు. 1967లో కాంగ్రెస్ అభ్య‌ర్ధి దేవి రమా కుమారి, 1972లో కాంగ్రెస్‌ పార్టీ అభ్య‌ర్ధి కళావతి, 1978లో ఇండిపెండెంట్ అభ్య‌ర్ది కె రామునాయుడు విజయం సాధించారు.

తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జి ఆదినారాయణపై 437 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన రెడ్డి సత్యనారాయణ ఇక్కడ గెలిచారు. ఆ త‌రువాత 1985,1989,1994,1999 వ‌ర‌కు వ‌రుస‌గా 5 సార్లు ఆయ‌న విజ‌యం సాధించి రికార్డు నెల‌కొల్పారు. 2004లో రెడ్డి సత్యనారాయణపై కాంగ్రెస్ అభ్య‌ర్ధి కరణం ధర్మ శ్రీ పోటీ చేసి గెలిచారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన జి రామానాయుడు, 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బి ముత్యాలనాయుడు విజయం సాధించారు. మ‌ళ్ళీ 2019లో పోటీ చేసిన‌ వైసీపీ అభ్య‌ర్ది బి ముత్యాల నాయుడు మరోసారి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన జి రామానాయుడుపై 16,392 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించి బూడి ముత్యాల నాయుడు వైసీపీ రెండో విడత మంత్రివర్గంలో చేరారు.

మ‌రో నెల‌రోజుల్లో జ‌రుగ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రోసారి బూడి ముత్యాల‌నాయుడు మాడుగుల నుంచి వైసీపీ అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి జి రామానాయుడుకి దాదాపుగా టికెట్ ఖ‌రారు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ఇరువురూ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. పొత్తులో భాగంగా జ‌న‌సేన కూడా ఇక్క‌డ టికెట్ ఆశిస్తోంది. మ‌రి కూట‌మి త‌ర‌పున ఎవ‌రు బ‌రిలోకి దిగుతారో చూడాలి.అయితే ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇక్క‌డ విజయం సాధించగా, 4సార్లు కాంగ్రెస్ పార్టీ, రెండుసార్లు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 2,15,571 మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్లు 1,04,981 మంది, మహిళా ఓటర్లు 1,10,584 మంది ఓటర్లు ఉన్నారు. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా మ‌హిళా ఓట‌ర్లే అధిక‌మంది పోలింగ్‌లో పాల్గొన‌డం ఇక్క‌డ విశేషం….

Read more RELATED
Recommended to you

Exit mobile version