ఏపీలో అధికార వైసీపీలో రచ్చ తారస్థాయికి చేరుకుంది. సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపైనే వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. మామూలుగా ప్రతిపక్ష టీడీపీ నేతలు, వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారంటే అది సహజమే అనుకోవచ్చు. సరే ప్రత్యర్ధి పార్టీ నేతలు అలాగే విమర్శలు చేస్తారని అనుకోవచ్చు. కానీ వైసీపీలో వింతగా సొంత పార్టీ కార్యక్ర్తలు, నేతలే..తమ ఎమ్మెల్యేలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంటే వైసీపీలో ఎమ్మెల్యేలపై ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందో అర్ధం చేసుకోవచ్చు.
అటు టెక్కలి వైసీపీ ఇంచార్జ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై సొంత పార్టీ ఎంపిటిసి, జెడ్పిటిసిలు, నాయకులు ఫైర్ అవుతున్నారు. దువ్వాడ వల్ల టెక్కలిలో పార్టీ నాశనమవుతుందని, టీడీపీ నుంచి వచ్చినవారికే దువ్వాడ ప్రాధాన్యత ఇస్తూ..నిజమైన వైసీపీ కార్యకర్తలకు న్యాయం చేయట్లేదని, ఆయన్ని వెంటనే ఇంచార్జ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటు తంబళ్ళపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై….తంబళ్ళపల్లె జెడ్పిటిసి సభ్యురాలు గీత భర్త కొండ్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తంబళ్ళపల్లెలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఇక విమర్శలు చేసిన తర్వాత ఒక ఫోర్జరీ కేసులో కొండ్రెడ్డి అరెస్ట్ అయ్యారు. అటు సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్..సొంత పార్టీపై అసంతృప్తితో..గన్మెన్లని వెనక్కి పంపేసి హైదరాబాద్‌కు వెళ్లిపోయారని తెలుస్తోంది. అటు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్‌పై సొంత పార్టీ సర్పంచ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో రచ్చ నడుస్తోంది. ఈ రచ్చకు త్వరగా బ్రేక్ వేయకపోతే వైసీపీ పరిస్తితి అస్సామే.