ఏపీపై అప్పులపై ఎవ‌రి లెక్క వారిదే.. అస‌లు నిజం ఏది…?

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంపై ఉన్న అప్పుల భారం ఎంత‌. అంటే దీనిపై రోజుకో లెక్క‌బ‌య‌టికి వ‌స్తోంది. ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా అప్పుల లెక్క‌ల‌ను బయట పెడుతున్నారు. రాష్ట్ర రుణభారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేతపత్రంలో విడుదల చేసిన లెక్క‌ల‌కు, త‌న హ‌యాంలో మాజీ సీఎం జ‌గ‌న్ చేసిన అప్పుల‌కు, అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగంలో ప్ర‌స్తావించిన లెక్క‌ల‌కు అస‌లు సంబంధం లేకుండా పోయింది. ఎవ‌రికి తోచిన‌ట్లు వారు ఏపీపై అప్పులు అంకెల‌ను వెల్ల‌డిస్తున్నారు. దీంతో ఒక రాష్ట్రం.. మూడు ర‌కాల అప్పులు అనే విధంగా ట్రోల్స్ న‌డుస్తున్నాయి. అస‌లు ఏపీపై ఉన్న అప్పులభారం ఎంత అనే ప్ర‌శ్న ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.ఎవ‌రి లెక్క‌లు న‌మ్మాలి అంటూ కొత్త‌ర‌కం చ‌ర్చ‌లు ఏపీలో ఊపందుకున్నాయి. అస‌లు నిజాలు చెప్పేవారు ఎవ‌రు అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

రాష్ట్రంసపై 13 లక్షల కోట్ల రూపాయ‌ల అప్పు ఉంద‌ని ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో చంద్ర‌బాబు,ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తావించారు. ఏపీలో కూట‌మి అధికారంలోకి రాగానే ఆర్ధిక ప‌రిస్థితిపై శ్వేత‌ప‌ట్రం విడుద‌ల చేశారు. ఇందులో లెక్క‌లు వేరుగా ఉన్నాయి. గత ఐదేళ్లలో రూ.9.74 లక్షల కోట్ల రుణ భారం పెరిగిందంటూ చంద్ర‌బాబు ధ్వజమెత్తారు. అవీ స‌రిపోక‌ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారని, స్థానిక సంస్థల నిధులనూ మళ్లించారని వైసీపీ పాల‌న‌పై మండిపడ్డారు. చంద్ర‌బాబు చెప్పిన లెక్క‌ల‌ను చూస్తే ఏపీ అప్పు త‌ల‌స‌రిగా రూ.1.44 లక్షలుగా ఉందని చెప్పారు.

ఈ లెక్క‌లు విన్న మాజీ సీఎం జగన్ త‌న హ‌యాంలో చేసిన అప్పుల లెక్కలను వివరించారు. రాష్ట్ర విభజన నాటికి అన్ని రకాలుగా రూ. 1,53,347 కోట్లుగా ఉంద‌ని చెప్పారు. చంద్రబాబు అధికారం దిగిపోయే నాటికి అన్ని రకాలుగా తీసుకున్న అప్పు రూ 4,08,710 కోట్లుగా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది జూన్‌ వరకు ప్రభుత్వ అప్పు చూస్తే.. 7,48,000 కోట్లుగా ఉంద‌ని జగన్ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల శాతం 21.63గా ఉండగా.. తన పాలనలో అది 12.90 శాతం మాత్రమేనని వివరించారు. ఆఖ‌రికి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో కూడా అప్పులు చిట్టాను త‌ప్పుగా చూపార‌ని జ‌గ‌న్ ఆరోపిస్తున్నారు.

వీట‌న్నింటినీ బ‌ట్టి చూస్తే ఒక రాష్ట్రంపై ఇన్న ర‌కాలుగా అప్పులు ఉంటాయా అంటూ సామాన్యుడు సైతం ఆలోచించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. జగన్ రాష్ట్ర అప్పు రూ 7.48లక్షల కోట్లు అని చెబుతుంటే.. చంద్రబాబు రూ 9.74 లక్షల కోట్లుగా చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో రూ 13 లక్షల కోట్లు అప్పు ఉందని చంద్ర‌బాబు చేసిన ప్రచారానికి ఇప్పుడు విడుద‌ల చేసిన లెక్క‌ల‌కు అస‌లు సంబంధం లేకుండా ఉంది. పథకాల అమలు నుంచి ఆర్దిక కారణాలు చెప్పి తప్పించుకొనేందుకే అప్పు పై అసత్య ప్రచారం చేస్తున్నారని జ‌గ‌న్ ఆరోపిస్తున్నారు. ఎన్నిక‌ల‌ సమయంలో చెప్పినట్లుగా అప్పుల భారం రూ.13 లక్షల కోట్లు కాదనేది స్పష్ట‌త వ‌చ్చింద‌ని వైసీపీ నేత‌లు సైతం అరోపిస్తున్నారు. దీంతో అస‌లు ఏపీపై ఉన్న అప్పుల భారం ఎంత అని ప్రశ్న‌లు వినిప‌స్తున్నాయి. దీనిపై ఎవ‌రు క్లారిటీ ఇస్తారో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version