రాజకీయాల్లో నాయకులు తీసుకునే నిర్ణయాలకు చాలా కారణాలు ఉంటాయి. ఒక నిర్ణయం వంద కారణాల కు దారి తీస్తుంది అంటారు. ఊరికేనే ఏ నాయకుడు కూడా నిర్ణయాలు తీసుకుంటారంటే నమ్మలేని కాలం ఇది. అలాంటి కాలంలో తాజాగా అపర రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు.. తాజాగా వేసిన ఓ పాచిక.. పారుతుందో లేదో కానీ.. దీని వెనుక మాత్రం చాలా కారణాలే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్నారు. జిల్లాల్లో పార్టీని నిలబెట్టేందుకు, నాయకుల్లో ధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట విశాఖలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన రాజకీయ పొత్తులకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల కు ముందు తాను కేంద్రంలోని బీజేపీతో(పార్టీ పేరు ఎత్తకుండానే) విభేదించామని, ఇదంతా ప్రజల కోస మే చేశానని, అయితే, ప్రజలు బాగానే ఉన్నారు తప్ప.. మేం(అంటే.. పార్టీ) మాత్రం నాశనం అయ్యామని చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే బీజేపీతో పొత్తుకు సిద్ధమనేలా ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కూడా చంద్రబాబు బీజేపీవైపు చూస్తున్నా.. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఇలా వ్యాఖ్యానించడం వెనుక కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పరిశీలన చేస్తే.. ప్రస్తుత సీఎం జగన్ వ్యూహం చాలా కనిపిస్తోంది.
గత టీడీపీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు అనుసరించి విధానాలు, ఉదారంగా ప్రభుత్వ ఫలాలను తన వారికి అప్పగించిన వైనాన్ని జగన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విభేదిస్తోంది. ఈ క్రమంలోనే అప్పటి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అమరావతి భూముల కుంభకోణం, పోలవరం అవినీతిపై ఇప్పటికే కమిటీలు వేసింది. ఆయా నివేదికలు ప్రభుత్వం చేతికి అందాయి. అదేసమయంలో చంద్రబాబు తన పార్టీ రాష్ట్ర కార్యాలయ భవనం కోసం ప్రభుత్వ భూములను ఆక్రమించారనే నివేదిక కూడా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది. ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు.
ఈ క్రమంలో.. ఇప్పటికిప్పుడు తనను రక్షించేవారు చంద్రబాబు చాలా అవసరం. అయితే, అది ఏ న్యాయ స్థానాలకో వెళ్లి తెచ్చుకుంటే.. పోయే పరువు పోగా.. మరింత బద్నాం కావడం తథ్యం. ఇక, రాష్ట్ర స్థాయిలో ఎన్ని పోరాటాలు చేసినా.. ఆధారాలతో సహా బయట పెట్టి చంద్రబాబును ఉతికి ఆరేసేందుకు జగన్ రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఇప్పుడు కేంద్రంలోని ప్రభుత్వం నుంచి అభయ హస్తం కావాలి. జగన్‌ను నిలువరించగలిగే శక్తి ఏదైనా ఉంటే.. అది ఒక్క తెలంగాణ సీఎం కేసీఆర్ లేదా కేంద్రంలోని బీజేపీ పెద్దలకు మాత్రమే ఉంది. అది కూడా నయానే.
అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చంద్రబాబు అంటే ఎంత అక్కసుందో తెలిసిందే. కాబట్టి ఇది వర్కవుట్ అవదు. ఇక, మిగిలింది , కేంద్రంలోని బీజేపీ సర్కారును ప్రసన్నం చేసుకోవడమే. ఈ నేపథ్యంలో హఠాత్తుగా మళ్లీ బాబు నోటి వెంట బీజేపీ అనుకూల రాగాలు వినిపిస్తున్నాయి. జగన్ ఎలాంటి చర్యలకైనా దిగకముందుగానే ఆయన బీజేపీతో చెలిమి చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మరి బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా.. జగన్ షాక్‌తో చంద్రబాబు గింగిరాలు తిరుగుతున్నారనడంలో సందేహం లేదు.