ముఖ్యమంత్రి కేసీఆర్ పై బహిరంగంగా తెగ విమర్శలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిజానికి సోనియా గాంధీ మాట వినరని.. కేసీఆర్ మాటే వింటారని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం సంగారెడ్డి, కొండాపూర్ మండలం మల్కాపూర్, తొగర్‌పల్లి గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారని, ఆయన జుట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లో ఉందని అన్నారు.
ఓటుకు నోటు కేసులో ఉన్న నాయకుడు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని షర్మిల విమర్శించారు. తాను బీజేపీ వదిలిన బాణమని పీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు జగ్గారెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాను వైఎస్‌ఆర్ వదిలిన బాణమని స్పష్టం చేశారు. రూ.300 బతుకమ్మ చీర ఇచ్చి పండగ చేసుకోమంటే ఎలా అని ప్రశ్నించారు.
రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భూముల కోసమే రీజినల్ రింగ్‌రోడ్ డిజైన్ మార్పు చేశారని షర్మిల ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగాల భర్తీపైనే చేస్తామని ప్రకటించారు. ఆడపిల్లలపై అత్యాచారాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.