వ్యవసాయాధారిత రాష్ట్రంలో సేద్యగాళ్లకు మరింత అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలకు నాంది పలికారు. వాటిలో భాగంగా రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని ఇవాళ రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఏటా 13,500 రూపాయలను (ప్రధాని అందించే 2,000) కలుపుకుని అందించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించనున్నారు. ఇందులో ప్రధాని అందించే రెండు వేల రూపాయలు ఈ నెలాఖరుకు జమ కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తరఫున అందించే ఐదు వేల 500 రూపాయలు మాత్రం ఇవాళ జమ కానున్నాయి. ఈ పథకం ద్వారా ఈ నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,758 కోట్లు జమకానున్నాయి.
మొదటి విడత ఏడు వేల ఐదు వందలు విడుదలయ్యాక అక్టోబర్ లో రెండో విడతలో భాగంగా నాలుగు వేల రూపాయలు, మూడో విడతలో భాగంగా రెండు వేల రూపాయలు విడుదల చేసి రైతుకు అండగా నిలవనున్నారు. ఇప్పుడు అందిస్తున్న రూ.3,758 కోట్లు 23 వేల 875 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా అందించామని (కొంత మొత్తం కేంద్ర సహకారంతో) ప్రభుత్వం చెబుతోంది. ఖరీఫ్ సాగుకు సాయం అందించేందుకు వీలుగా ఈ ఏడాది చెప్పిన మాట ప్రకారం తాము ఈ మొత్తాలను విడుదల చేయనున్నామని సీఎం జగన్ అంటున్నారు.
వాస్తవానికి మ్యానిఫెస్టోలో 12 వేల ఐదు వందల రూపాయలు అందించాలని నిర్ణయించామని కానీ ఇప్పుడు అదనంగా మరో వెయ్యి జత చేసి అందిస్తున్నామని ఆ రోజు చెప్పిన డబ్బులు అందించి ఉంటే ఈ నాల్గేళ్లలో ఒక్కో రైతుకు ఏడాది 50 వేలు మాత్రమే జమ అయి ఉండేవని, కానీ ఇప్పుడు 67,500 జమ అవుతున్నాయని అంటే అదనంగా ఒక్కో రైతుకు ఇప్పటిదాకా అందించిన మొత్తం 17,500 కోట్ల రూపాయలు అని వివరిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇవే కాకుండా వివిధ పథకాల ద్వారా ఇప్పటిదాకా రైతుకు అందించిన లబ్ధి 1,10,099 కోట్ల రూపాయలు అని వెల్లడించాయి. సాగు లాభదాయకం చేసే విధంగా కొన్ని చర్యలు చేపట్టామని, వాటికి అనుగుణంగా ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు వస్తున్నాయి అని చెబుతున్నాయి.