అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు తెలుగుదేశం మేనిఫెస్టో విడుదల చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీనిని ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ చీఫ్ చంద్రబాబు పై వైకాపా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
స్థానికల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటూ.. ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో విజయంమే లక్ష్యంగా ముందుకు సాగుతూ.. ఏకంగా మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనిని అధికార పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జరిగే ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం ఏంటనీ పేర్కొంటూ.. అధికార పార్టీ వైకాపా లీగల్ సెల్ కార్యదర్శి సాయిరాం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. కాగా, తాజా ఎన్నికల క్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు మేనిఫెస్టో గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘పల్లె ప్రగతికి పంచ సూత్రాలు’ పేరుతో.. ‘పల్లెలు మళ్లీ వెలగాలి’ అన్న నినాదంతో తెదేపా ఈ ప్రణాళికను రూపొందించడం విశేషం.