Breaking : మోడీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ బహిరంగ లేఖ

-

రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధానమంత్రి ప్రారంభించడం అయిపోయిన పెళ్లికి మేళాలు వహించినట్టుందన్నారు కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తాజాగా ఆయన ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు.. ఆ లేఖలో.. ‘పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదించుకున్నారని తెలంగాణ ప్రజలను అగౌరవపరిచే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తాను చేసిన వ్యాఖ్యలను వెనెక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టాలి. భారత ప్రధాన మంత్రి గారు తెలంగాణలో అడుగు పెట్టే ముందు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అమరవీరులకు క్షమాపణ చెప్పి రావాలని డిమాండ్ చేస్తున్నాము.

ఎందుకంటే తెలంగాణ విభజన ఆరు దశాబ్దాల ఆకాంక్ష, అటువంటి తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలర్పించి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రతిపక్ష నాయకురాలైన భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు లోక్ సభలో మద్దతు ఇచ్చిన తర్వాతనే, తెలంగాణ బిల్లు పాస్ అయితే, ఆ తెలంగాణ బిల్లును కించపరిచే విధంగా పార్లమెంటులో తలుపులు మూసి దొంగతనంగా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినారని, తెలంగాణ ఏర్పాటు అనేది దేశ విభజన కోరుకునేవారు చేసినారని, తల్లిని చంపి, బిడ్డను బ్రతికించారని తెలుగు రాష్ట్రాల తెలుగు తల్లి ఏడుస్తున్నది, తెలుగు మాట్లాడేవారు ఏడుస్తున్నారు అని ఈ దేశ ప్రధాని అయిన మీరు పార్లమెంట్
సాక్షిగా చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్షను అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ, తెలంగాణలో అడుగుపెట్టేముందు తెలంగాణ ఏర్పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు జరిగిందని ప్రకటిస్తూ ఈ తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను.

ఆనాడు భారతీయ జనతా పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల అంగీకారం మేరకు రాష్ట్ర విభజన జరిగిన తరువాత విభజన హామీలు ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు, అమలు చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాష్ట్ర విభజననే అపహాస్యం చేసే విధంగా మాట్లాడడమే కాకుండా తెలంగాణ విభజన హామీలు ఏవి కూడా అమలు చేయని పరిస్థితిని మరోసారి గుర్తు చేస్తూ, ఆయన తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టే ముందు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన విభజన హామీలను ఈ సందర్భంగా ప్రధాని ముందుకు తీసుకువస్తున్నాను.

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం బొగ్గు గనులు, ఎయిమ్స్ లేదా తెలంగాణలో మెడికల్ కాలేజీలు, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ఏర్పాటు పట్ల మీరు ఈరోజు వరకు వివక్ష చూపుతూనే ఉన్నారు. వీటన్నింటి పట్ల రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రశ్నించవలసిన టిఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉంటూ 8 సంవత్సరాలుగా మీతో అంటగాగుతూ, మీకు అనుబంధ సంస్థగాపనిచేస్తూ నేడు రాజకీయ కారణాలతో ప్రశ్నించడం విడ్డూరంగా వుంది.

వాస్తవికంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ప్రజల విభజన హామీలను అమలు పరచవలసిన బాధ్యత మీదే అని మర్చిపోకండి. ఆనాడు 2013లో దేశంలో ఉన్నటువంటి 5 మూత పడి నటువంటి ఎరువుల కర్మాగారాలను తెరవాలని నిర్ణయం తీసుకున్నది నాటి ప్రధాని మన్ మోహన్ సింగ్.

రామగుండం ఎరువుల కర్మాగార పునరుద్ధరణ కాంగ్రెస్ పుణ్యమే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు రామగుండంకు ఆనాడే 10,000 కోట్ల నిధులు ఇచ్చి, మిగతా 5 ఎరువుల కర్మాగారాలకు నిధులు కేటాయించినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

1980లో దేశీయ అవసరాల నిమిత్తం 750 టన్నుల సామర్థ్యంతో మొదలు పెట్టి, అప్పటికే అందుబాటులో ఉన్నNTPC ద్వారా కరెంట్ ఉత్పత్తి ప్రారంభం చేశారు. కొంత నష్టం వాటిల్లినప్పటికి దేశీయ ఉత్పత్తి ఉండాలనే సంకల్పంతో నష్టాల బారిన నడుస్తున్న ఈ సంస్థను 20 సంవత్సరాలు నడిపారు. 1999లో BJP ప్రభుత్వ హయాంలో సంస్థ మూసివేయబడ్డది. 1999-2004 వరకు ఉన్నBJP ప్రభుత్వంలో తెరవడానికి గానీ, కొనసాగించడానికి గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి.. ప్రధాని మన్మోహన్ దృష్టికి తీసుకెళ్లి, కర్మాగారం తెరవడానికి పునాదులు వేశారు. తర్వాత 2009 లో నాటి కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, ఎస్. జైపాల్ రెడ్డి, మధు యాష్కీ, సిరిసిల్ల రాజయ్య, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, మంద జగన్నాథం, గుత్తా సుకేందర్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, చొరవతో కర్మాగారం పై ఉన్నరుణాలు, బ్యాంకు అప్పులు మొత్తం రూ 10 వేల కోట్లు మాఫీ చేశారు.

అనంతరం విద్యుత్ ద్వారా కాకుండా గ్యాస్ అదారిత ప్రాజెక్ట్ గా మార్చి సామర్ధ్యం పెంచడానికి సాంకేతిక నిపుణులు, ఆర్ధిక నిపుణులతో కమిటీ వేసి, సర్వేలు చేసి, వ్యయం అంచనాలు తయారు చేసింది. 350 కేజీ బేసిన్ నుండి గ్యాస్ తేచ్చి దానిపై ప్రణాళిక చేసింది. వ్యయం అంచనాన్ని 4000 కోట్ల కీ అంచనా వేసింది

10000 కోట్లు ఇంకో 4000 కోట్లు ఖర్చు చేసి 2 లక్షల టన్నుల ఉత్పత్తి కీ ప్రణాళిక లు చేసి కేంద్రం నుండి మొత్తం 10 వేల కోట్ల రుణాలు 2014కు ముందే మాఫీ చేసి మొత్తం అనుమతులు పూర్తి చేసింది. 2013లో 5600 కోట్ల పెట్టుబడితో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పున ప్రారంభించడానికి కాబినెట్ తీర్మానం చేసింది, ccea లో సైతం ఆమోదం తెలిపారు.

ఇంతలో 2014 ఎన్నికలు వచ్చాయి. 2014 ముందే కాంగ్రెస్ పార్టీ మొత్తం పనులు పూర్తి చేసి, కర్మాగారాన్ని 6000 కోట్ల సమీకరణ (విదేశీ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం వాటా, బ్యాంకుల వాటా, కేంద్రం వాటా ) చేసి ప్రారంభం చేశారు. 2019 లో ట్రయల్స్ పూర్తి చేసుకొని యేడాదిన్నర క్రితం ఉత్పత్తి ప్రారంభించింది.

కాబట్టి ఏది ఏమైనా మీరు ఈ ప్రధానమైనటువంటి 3 అంశాలపై ప్రతిస్పందించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను.

1. పార్లమెంట్ తలుపులు మూసి దొంగతనంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదించుకున్నారని తెలంగాణ పట్ల అగౌరవంగా, దేశ ప్రధానిగా పార్లమెంటులో మీరు చేసిన వ్యాఖ్యల పట్ల స్పష్టంగా బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.

2. తెలంగాణ విభజన హామీలు ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది తప్ప రాజకీయ పార్టీలుగా ఇచ్చిన హామీలు కావని, ఆ విభజన హామీలను తప్పకుండా అమలు అమలుపరిచే విధంగా ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాను.

3. ఈరోజు ఎరువుల కర్మాగారం తెరుస్తున్నారంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారి కృషివల్లనే అనే మాటలను విస్మరించవద్దని ఈ సందర్భంగా మనవి చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సందర్భంలో వీటన్నింటిని జ్ఞాపకం ఉంచుకొని తెలంగాణ ప్రజలకు తప్పకుండా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version