తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడ్రోజులు వర్షాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో మూడ్రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ వైపునకు కిందిస్థాయి గాలులు.. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని వెల్లడించారు.
ఇవాళ దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
ఈ ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాలలోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లోని నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ సంచాలకులు వివరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కురిసిన వర్షాలతో పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.