సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ మట్టి మనుషులని, వారికి మట్టితో అవినాభావ సంబంధం ఉందని బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. అందుకే మట్టికి చెట్టుకు ఉన్న అనుబంధంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టారని ప్రశంసించారు. తెలంగాణ అంతటా పచ్చదనం పెరిగిపోయిందని. దీనికితోడు వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు అధికమై చెరువులు అలుగులు పోతున్నాయని చెప్పారు. దీని వల్ల సీఎం కేసీఆర్ విజన్ అయిన బంగారు తెలంగాణ సహకారం దగ్గర్లోనే ఉందని ప్రకాశ్‌రాజ్ తెలిపారు.
టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలును నటుడు ప్రకాశ్ రాజ్ స్వీకరించారు. షాద్‌నగర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో తన కుమారుడితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సంతోష్‌పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు కురిపించారు. తనకు ఇష్టమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. తన మిత్రుడు మోహన్‌లాల్, తమిళ్ నటుడు సూర్య, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిషలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. తన అభిమానులకు కూడా మొక్కలు నాటి, పది మందితో మొక్కలు నాటించాలని విజ్ఞప్తి చేశారు.