రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 375 స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పెద్దలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఓ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరీ ఆ బ్లూ ప్రింట్‌లో ఏముంది? 2024 స్ట్రాటజీ ఏం చెబుతోంది? వివిధ మీడియా కథనాల ప్రకారం.. ఈ సమావేశంలో అత్యంత సమగ్ర రూపంలో పీకే తన నివేదికను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఇతర పెద్దలకు వివరించారు. అనుసరించాల్సిన ఎత్తుగడల గురించి చెప్పారు. ‘4ఎం’ ఫార్ములాను అమలు చేయాలని సూచించారు. ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు (మెస్సేజ్), ఆ సందేశాన్ని తీసుకెళ్లేదెవరు (మెస్సెంజర్), ఇందుకు తగిన యంత్రాంగం (మెషినరీ) రూపకల్పన, సరిదిద్దుకునే వ్యవస్థ (మెకానిక్స్) ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ సూత్రం ఆధారంగానే పార్టీ ముందుకు వెళ్లాలని కూడా సూచించారు. ఈ ఫార్ములాకు తోడు ‘‘ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయడం కాదు. ప్రతి క్షణం అదే యావతో ఉండాలి. బీజేపీ తరహాలో ఏడాదిలో 365 రోజులు నేతలు లైవ్‌లో ఉండాలి. కనిపించాలి. పార్టీ నిర్దేశిత ఫ్రేమ్ వర్క్‌పై నిత్యం నిరంతరం చర్చ జరిపేలా చూడాలి. ప్రత్యర్థి భాషను గుర్తించి దానికి అనుగుణంగా మన గొంతులను సవరించుకోవాలి. దానినే ఆయుధంగా సంధించాలి. యూపీలో గత ఐదేళ్లుగా కాంగ్రెస్, బీఎస్పీలు నిర్లిప్తంగా వ్యవహరించాయి. అందువల్లే ఓటమి ఎదురైంది. అదే ఎస్పీ క్రియాశీలకంగా వ్యవహరించింది. కాబట్టే ఎన్నికల సమయంలో మేనకాగాంధీని, మాయావతిని ఓటర్లు పట్టించుకోలేదు. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతలా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. అదే బీజేపీకి లాభించింది. పర్యవసానంగా యూపీ ఎన్నికలు రెండు పార్టీల మధ్య పోరుగా మారింది. కాంగ్రెస్, బీఎస్పీ ఆటలో అరటి పండుగా మిగిలాయి’’ అని పీకే వివరించారు.
‘‘బీజేపీ ఎదిగిన తీరును గుర్తించాలి. రాజకీయాలు చేస్తూనే ఆయా కులాలు, వర్గాల వారీగా పట్టు సాధించేందుకు ప్రణాళికలు రచించి అమలు చేసింది. కానీ.. కాంగ్రెస్‌లో ఇది లోపించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధించేందుకు బీజేపీ తాత్కాలికంగా తన ఎజెండాను పక్కన పెట్టింది. ఆయా పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. నిలదొక్కుకుని బలో పేతం అయ్యాక తన ఆలోచనల అమలుకు ప్రయత్నిస్తోంది. ఈ వ్యూహంతోనే బిహార్‌లో ఒకప్పుడు అతిపెద్ద పార్టీగా ఉన్న జేడీయూను రెండో స్థానానికి నెట్టింది. మహారాష్ట్రలో శివసేనను తన జూనియర్ పార్ట్ నర్‌గా మార్చుకుంది. బీజేపీతో పోలిస్తే కరుడుగట్టిన హిందూత్వ పార్టీ అయిన శివసేన ఇప్పుడు తన హిందూత్వను నిరూపించుకోవాల్సిన దుస్థితిని తీసుకువచ్చింది. తాను నిలదొక్కుకునే వరకు ఆయా పార్టీలతో స్నేహం చేయడం .. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టడం బీజేపీ వ్యూహం. ఈ విధానాన్ని గమనించి కాంగ్రెస్ అడుగులు వేయాలి’’ అని సూచించారు.
దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో బలోపేతానికి రాష్ట్రాల వారీగా వ్యూహాలు రచించాలని కోరారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాటిదార్ సామాజిక వర్గాన్ని చేరదీయాలని, గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన రాష్ట్రాల్లో ఒంటరి పోరుకు కాంగ్రెస్ సమయాత్తం కావాలని సూచించారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశాలో సమూల ప్రక్షాళన చేయాలని అన్నారు. వచ్చే ఏడాది తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పొత్తులకు ప్రయత్నించాలని చెప్పారు. ఈ మేరకు బ్లూ ప్రింట్ ను పీకే సమర్పించారని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించాయని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే.. కాంగ్రెస్ లో చేరికపై మరికొద్ది రోజుల్లో పీకే ఒక క్లారిటీ రానున్నందున ఈ బ్లూప్రింట్ లోని మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే.. పీకే సూచనలను కాంగ్రెస్ పెద్దలు ఎంతవరకు పట్టించుకుంటారు? ఏ మేరకు అమలు చేస్తారు? అన్నది వేచి చూడాల్సిందే.