దేశ రాజకీయాల్లో వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన ప్రశాంత్ కిషోర్ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ వ్యూహకర్తగా పనిచేయబోనని చెప్పేశారు. కానీ దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక కూటమిని కూడగట్టే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. మిషన్ 2024లో భాగంగా ఇప్పటికే ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి దేశ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేంద్రంలో తిరుగులేని నేతగా ఉన్న ప్రధాని మోడీ ఇమేజ్‌ను తగ్గించడానికి, బీజేపీని ఓడించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొవిడ్ -19 సెకండ్ వేవ్ కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత తెచ్చింది. ప్రజల్లో కూడా బీజేపీపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
ఈ క్రమంలోనే మోడీకి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక్కటి చేయడానికి పీకే ప్లాన్ వేశారు. ఇప్పటికే కేటీఆర్‌తో పలుమార్లు సంప్రదింపులు కూడా జరిపారు పీకే. అయితే కేసీఆర్ కూడా బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇక రాష్ట్రంలో కూడా బీజేపీ బలపడకుండా చూసేందుకు పీకే టీమ్ లో చేరతారని తెలుస్తోంది. ప్రతిపక్షాలను ఒక్క తాటిమీదకు తెచ్చేందుకు దక్షిణాది సీఎంలతో పీకే చర్చిస్తున్నట్టు సమాచారం.