భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల హైదరాబాద్కు రానున్నారు. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. సంబంధిత అధికారులకు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఈనెల 21, 22 తేదీల్లో ద్రౌపది ముర్ము నగరంలో పర్యటన ఉన్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమె పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనుండగా.. ఆ రూట్లలో ట్రాఫిక్ నిబంధనలు, కంట్రోల్, పోలీస్ బందోబస్తుపై డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెండ్రోజుల పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని అందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసి చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.