దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర వేడుకల వేదికైన ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన అనంతరం ఆహుతులపై భారత వైమానిక దళానికి చెందిన హెలీకాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, స్మృతి ఇరాని, నిర్మలా సితారామన్ సహా ఇతర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, అతిథులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
ప్రధాని హోదాలో మోడీ పతాకావిష్కరణ చేయడం ఇది తొమ్మిదవసారి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరిస్తున్నామని ఆయన అన్నారు. దేశంలోని నలుమూలలా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందన్నారు. మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని స్మరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ అనంతరం భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు.