నిన్నటి వేళ ఎన్నో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు యువకుల ఆగ్రహావేశాలు కారణంగా వారు కోల్పోయిన విచక్షణ కారణంగా ఎన్నో సంఘటనలు విషాద స్మృతిలో చేరాయి. అగ్నిపథ్ అనే పథకానికి వ్యతిరేకంగా చేస్తున్న లేదా చేయాలనుకుంటున్న ఆందోళనలు ఇకపై ఆగితే చాలు. ఇంకేమీ వద్దు. ముఖ్యంగా నిరసనలు తెలిపేందుకు ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడంలో అర్థం ఏమీ లేదు.
యుద్ధం చేసే పద్ధతి ఇది కాదు
దేశాన్ని ప్రేమించే పద్ధతి కూడా ఇది కాదు
అస్సలు పశ్చాత్తాపం అన్నది లేకుండా మాట్లాడుతున్నారే!
రేపటి వేళ కేసులు నమోదు అయి జైలు పాలయితే
ఏ నాయకుడు వచ్చి మిమ్మల్ని కాపడగలడు?
గుర్తు పెట్టుకోండి ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి అనుకున్నవిధంగా
ప్రభుత్వాలను దారికి తెచ్చుకోవడం అన్నది జరగని పని!
దేశానికి సేవ చేయాలనుకుంటున్న పద్ధతి ఇది అయితే కాదు. ఇందులో పాలకుల తప్పిదాలు వాళ్ల తక్షణ అవసరాలు అన్నవి ఎప్పుడూ చర్చకు ఉండేవే ! వాటిని దృష్టిలో ఉంచుకుని రైళ్లను తగులబెట్టడం, ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేయడం అన్నవి తగని పని. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ బాలేదు.. లేదా ఇప్పటిదాకా చేయాలనుకున్న పనులు బాలేవు. వీటిపై కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం ఒకటి తప్పక చేయాలి.