రాష్ట్రంలో సంచలనం కలిగించిన పుడింగ్ అండ్ మింక్స్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో నిందితులను విచారించిన కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయినా.. విచారణ మరింత లోతుగా వెళ్లకుండా ఉండేందుకు కొన్ని అదృశ్య శక్తులు తీవ్రంగా అడ్డుపడుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసులో రాజకీయనాయకులు.. ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ పోలీసు ఉన్నతాధికారి ఇన్వాల్వ్ అవడమే కారణమని అంటున్నారు. అందుకే కేసులో విచారణ జరుగుతున్నా అది మరింత ముందుకు సాగడం లేదని అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో కేసులో ప్రధాన నిందితులైన పబ్ నిర్వాహకుడు అభిషేక్, మేనేజర్ సునీల్ లు విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలిసింది. ఈ కేసులో వారికి కస్టడీ ముగియనున్నందున మరోసారి వారి కస్టడీకి పోలీసు అధికారులు యత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే.. ఇంతమంది రాజకీయనేతల అండదండలు ఉన్న ఈ పబ్ పై పోలీసులు సడెన్ గా దాడి చేయడమేమిటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే పబ్ నిర్వాహకులతో వచ్చిన విబేధాల వల్లే డ్రగ్స్ వాడకంపై పోలీసులకు ఉప్పు అందిందని, దానివల్లే వారు రెడ్ హ్యాండెడ్ గా దాడి చేయగలిగారని అంటున్నారు.