శ్రీవారి సన్నిధిలో వైభవంగా పుష్ప యాగం

-

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి ఇవాళ కన్నులపండువగా పుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఉద‌యం 9 గంటలకు మొదలైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం 11 గంట‌ల వ‌ర‌కు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తున్నారు.

మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తర్వాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. పుష్పయాగం సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను దేవస్థానం రద్దు చేసింది.

పుష్పయాగ మహోత్సవానికి సోమవారం రాత్రి శ్రీవారి ఆలయంలో అంకురార్పరణ చేశారు. మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన విష్వక్సేనుల వారిని ఆల‌యం నుంచి వ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహ‌ణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. రాత్రి 8 నుండి 9 గంట‌ల నడుమ ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version