ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక సీట్లు గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలుసు, ప్రత్యర్థి పార్టీలు వారికి అభ్యర్థి ఎవరో తెలుసుకోవడానికి తర్జన భర్జన పడుతున్నాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు విభిన్నంగా ఆలోచించాలని, అభివృద్ధి వైపే నిలవాలని పిలుపునిచ్చారు. ఇతర జిల్లాల కంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు పెద్ద పీట వేశారని పేర్కొన్నారు.
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేనిది.. కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో చేసి చూపించిందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా బీఆర్ఎస్ పథకాల నుంచి కాపీ కొట్టినవేనని అన్నారు. 60 ఏళ్ల పాలనలో.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల బీమా గురించి ఆలోచించిందా అని ప్రశ్నించారు. 2009 మేనిఫెస్టో హామీల్లో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని మండిపడ్డారు.