చదువులన్నీ ఏమౌతున్నాయి. చదువులన్నీ ఏ విధంగా ఉన్నాయి అన్న ప్రశ్నలకు మరో రూపం నారాయణ విద్యా సంస్థల బాగోతం కావొచ్చు. వేలకు వేలు ఫీజులు, ఇరుకిరుకు గదులు, వెలుతురు కూడా రానివ్వని వైనం. వాళ్లకు బయట ప్రపంచం తెలియదు. మార్కులు రాకపోతే ఒకటే ఆత్మ న్యూనత ఇంకా ఇంకొన్ని వాళ్లను వేధించాయి. వేధిస్తున్నాయి. ఈ పాపం ఎవరిది?
నారాయణ అనే మాజీ మంత్రి నిన్నటి వేళ అరెస్టు అయ్యారు కదా! కనుక ఇప్పుడు ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. కానీ ఎప్పటి నుంచో ఈ పీడ ఉంది. వీరి పీడన కారణంగా బలైపోయిన పిల్లల జీవిత కాల వ్యథ ఒకటి వెన్నంటే ఉంది ఈ చరిత్రకు ! కనుక బిడ్డలను చదవమని చెప్పండి చాలు.. ఎవరెస్టు ఎక్కే శక్తి వాళ్లకు వస్తే ఎక్కుతారు లేదంటే ఎక్కేందుకు ప్రయత్నిస్తారు అంతేకానీ
ఎగదోయకండి అని అంటున్నారు కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ కేంద్రంగా పనిచేసే సోషల్ మీడియా యాక్టివిస్ట్ రఘు భువనగిరి ఏమంటున్నారో చూడండిక. సారీ చదవండిక.
నారాయణ చేసిన దారుణాల్లో పేరెంట్స్ వాటా సగం అని అంటున్నారు సోషల్ మీడియా యాక్టివిస్టు రఘు భువనగిరి. ఆయనేమంటున్నారంటే..నారాయణ, చైతన్యల చదవకుంటే అది చదువే కాదన్నట్టు, అక్కడ అడ్మిషన్ దొరక్కుంటే ఇంకెందుకు పనికిరాడు అన్నట్టు, మార్కులు వస్తే చాలు పిల్లల మనసుతో సంబంధం లేదన్నట్టు, ర్యాంక్ వస్తే చాలు రాచి రంపాన పెట్టిన ఏంగాదన్నట్టు, ఆ కోళ్ల ఫారమే ప్రపంచమన్నట్టు..పోటీ పడ్డది మనం.
సీట్ల కోసం ఫైరవీలు చేసి, లక్షల డబ్బులు పోసి వాళ్లను సాకింది మనం. ఇది నిలబెట్టుకునే ప్రయత్నంలో వాళ్లు చేయని దారుణాల్లేవు. మామూలు కాలేజీలను మింగేశారు. ఎందరు పిల్లలు ఆత్మ హత్యలు చేసుకున్నారో లెక్కేలేదు. ఫీజులు కట్టలేక అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో. ఐనా నారాయణ, చైతన్యలనే సీటు కావాలని సర్వం త్యాగం చేసింది మనం. ప్రభుత్వాలు కూడా వాళ్లకు సహకరించినవే. పేపర్ లీక్ కొత్త కాకున్నా..రాజకీయ కారణాలు ఉన్నా సరే అరెస్ట్ చేయడం కరెక్టే. ఇంత జరిగినా మన మమ్మీ డాడీలు మారరు గాక మారరు…
అని చెప్పారాయన.