హవ్వ… చంద్రబాబుపై 307 కేసు పెడతారా ? – రఘురామ సీరియస్‌

-

 

హవ్వ… చంద్రబాబుపై 307 కేసు పెడతారా ? అంటూ ఎంపీ రఘురామ సీరియస్‌ అయ్యారు. కోరుకొండలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బ్రహ్మరథం పడితే, కోనసీమలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజలు పట్టించుకోలేదని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. పబ్లిక్ మీటింగ్ లేకపోవడం వల్ల జన సమీకరణ చేయకపోవడంతో జగన్ మోహన్ రెడ్డి గారిని పట్టించుకున్న వారే లేరని, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఓ 200 మంది మినహా ఎక్కువ మంది ఆయన పర్యటన సందర్భంగా కనిపించలేదని అన్నారు.

ఇన్నాళ్లు జగన్ మోహన్ రెడ్డి గారి బహిరంగ సభలకు భయపెట్టి, బ్రతిమాలి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి జనాలను సమీకరించే వారని, అసలు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి ఇది అని అన్నారు. తొలిసారిగా జగన్ మోహన్ రెడ్డి గారు తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడారని, నేనేమైనా తప్పులు చేసి ఉంటే సరి చేసుకుంటానని, అలాగే అధికారులు తప్పులు చేసి ఉంటే సరి చేయడానికి వచ్చానని చెప్పిన తీరు నచ్చిందని అన్నారు. తమ పార్టీ పైనున్న ద్వేషమే వల్లే, ప్రతిపక్షాల సభలకు ఇసుక వేస్తే రాలనంత జనం హాజరవుతున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

సంయమనానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు హత్యాయత్నానికి కుట్ర చేశారని ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన నారా చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలను చేయాలనుకుంటే, ప్రస్తుతం పాలకపక్షంలో కొనసాగుతున్న వారిలో ఎంత మంది మిగిలేవారని ప్రశ్నించారు. చిరంజీవి గారిపై విమర్శలు చేయడం, చంద్రబాబు నాయుడు గారిపై కేసులు నమోదు చేయించడం చూస్తే ముఖ్యమంత్రి గారి మానసిక పరిస్థితి ఏమిటో అర్థం అవుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version