వై.యస్.వివేకానంద రెడ్డి గారిది లవ్ జిహాద్ హత్య – రఘురామకృష్ణ

-

 

మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారిది లవ్ జిహాద్ హత్యగా నిందితుడు సునీల్ యాదవ్ తరఫున నయన్ రెడ్డి అనే సీనియర్ న్యాయవాది గారు వాదనలు వినిపించడం విస్మయాన్ని కలిగించిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సీబీఐ కూడా గట్టిగానే వాదనలు వినిపించిందని, అలాగే డాక్టర్ వై.యస్. సునీత గారి తరపు సీనియర్ న్యాయవాది గారు కూడా తన వాదనలు వినిపించారని అన్నారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక రాజకీయంగా పలుకుబడి కలిగిన పెద్దలు ఉన్నారని సీబీఐ తరపు న్యాయవాది తన వాదనలలో పేర్కొన్నారన్నారు. హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వై.యస్. అవినాష్ రెడ్డి గారిని, ఆయన తండ్రి వై.యస్. భాస్కర్ రెడ్డి గారుని విచారిస్తున్నట్లుగా తెలిపారు.

వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు ముందు ఆ తరువాత వై.యస్. భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో శివ శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ తో పాటు సహనిందితులు సమావేశమయ్యారని తెలిపారు. వీరితో వై.యస్. వివేకానంద రెడ్డి గారి వెంట ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఫోన్లో మాట్లాడినట్లుగా కాల్ డేటా రికార్డులు స్పష్టంగా ఆధారాలు లభించాయని చెప్పారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం వై.యస్. అవినాష్ రెడ్డి గారు కొన్ని ఫోన్ నెంబర్లకు ఫోన్ చేశారని, ఆ నెంబర్లను ఎవరైతే వినియోగిస్తున్నారో వారిని కూడా పిలిచి విచారించినట్లుగా సీబీఐ న్యాయవాది గారు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకుందని వెల్లడించారు.

 

వై.యస్. వివేకానంద రెడ్డి గారిది లవ్ జిహాద్ హత్య అని చెత్త మాటలను ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, ఇటువంటి మాటల ద్వారా ఇందులో మరింతగా కూరుకుపోతున్నారన్న విషయాన్ని వారు గ్రహించాలని అన్నారు. ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడని, తనకు ఇస్తానన్న ఆస్తి ఇవ్వలేదని ఆస్తి కంటే ఎక్కువ సొమ్మును ఇచ్చి ఎవరైనా హత్య చేయిస్తారా? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని పలుచన చేసే విధంగా మాట్లాడుతున్న మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, మరో రెండు మూడు నెలల వ్యవధిలో వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒక కొలిక్కి వస్తుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణ రాజు గారు వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version