దేశాన్ని ఏకం చేయడమే యాత్ర ముఖ్య ఉద్దేశం : రాహుల్‌

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర నిన్న ఢిల్లీకి చేరుకుంది. అయితే.. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్నది నరేంద్రమోదీ ప్రభుత్వం కాదని, అంబానీ.. అదానీ ప్రభుత్వమని అన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ఈ ఉదయం (శనివారం) హర్యానాలోని బదార్‌పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలో ప్రవేశించింది. ఎర్రకోట వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు నింపేసి దేశం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర లక్ష్యం గురించి మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేయడమే యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. కన్యాకుమారిలో యాత్ర ప్రారంభించినప్పుడు ద్వేషాన్ని తుడిచిపెట్టేయవలసిన అవసరం వుందని అనుకున్నానని రాహుల్ పేర్కొన్నారు.

దేశంలో ప్రతి చోట విద్వేషం నిండిపోయిందన్నారు. అయితే, తాను యాత్ర ప్రారంభించి నడక మొదలుపెట్టిన తర్వాత నిజం వేరేలా ఉందన్నారు. దేశంలో ప్రతి క్షణం హిందూ, ముస్లింల మధ్య విద్వేషం వ్యాప్తి చెందుతోందన్నారు. కానీ, ఇది నిజం కాదని, ఈ దేశం ఒక్కటేనని, తాను తన యాత్రలో లక్షలాదిమందిని కలిశానని, వారందరూ ఒకరినొకరు ప్రేమిస్తారని అన్నారు. మరి అలాంటప్పుడు ద్వేషం ఎలా వ్యాప్తి చెందుతోందన్నదే అసలైన ప్రశ్న అని రాహుల్ పేర్కొన్నారు. చుట్టూ ఒకసారి చూడాలని, ఓవైపు జైన్ మందిర్, మరోవైపు గురుద్వారా, ఇంకోవైపు ఆలయం, మరోవైపు మసీదు ఉన్నాయని, ఇండియా అంటే ఇదేనని అన్నారు. మన దృష్టిని మరల్చేందుకే హిందూ, ముస్లిం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని రాహుల్ ఆరోపించారు. ఎవరైనా మన జేబు కొట్టేయాలంటే తొలుత వారు చేసేది మన దృష్టిని మరల్చడమేనని పేర్కొన్నారు. అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే హిందూ, ముస్లిం రాజకీయాలు చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version