సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో కీలక మలుపు తిరిగింది. అల్లర్ల తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారని రైల్వే ఎస్సీ అనురాధ వెల్లడించారు. వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించే విధంగా పక్కా ప్లాన్ చేశారని ఆమె పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన ప్రస్తుతం 8 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో 8 మంది పరారీలో ఉన్నట్లు ఎస్పీ అనురాధ తెలిపారు. అలాగే అగ్నిపథ్ స్కీమ్‌తో యువత ఆర్థికంగా నష్టపోతారని, అందుకే పలు అకాడమీలు ఆందోళనకు ప్రోత్సాహించినట్లు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్‌పై నిరసనకారులు ఆందోళనకు దిగారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ భారీ స్థాయిలో ఆందోళన చెలరేగింది. ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు మహబూబ్‌నగర్, కరీంనగర్‌కు చెందిన ఇద్దరు అకాడమీ డైరెక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే మల్లారెడ్డి, శివసాయి డిఫెన్స్ అకాడమీ ఉద్యోగులు కూడా ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. 18 అకాడమీ అభ్యర్థులతో 8 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారని, ఈ 8 వాట్సాప్ గ్రూపుల్లో 2వేల మంది ఆందోళన కారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.