గులాబీ బాస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 115 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. చాలావరకూ సిట్టింగులకే టికెట్లు ఖరారు చేశారు. అయితే.. కొన్ని సీట్లలో మాత్రం మార్పులు తప్పలేదు. ఏడుచోట్ల సిట్టింగ్ అభ్యర్థులకు షాక్ ఇచ్చి.. నాలుగు స్థానాల్లో మాత్రం అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. వీటిలో జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో రచ్చ నడుస్తున్న జనగామ స్థానాన్ని సైతం హోల్డ్‌లో ఉంచారు. దీంతో టికెట్ ముత్తిరెడ్డికా..? ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికా..? లేదంటే పోచంపల్లికా అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.
ఈ రోజు ప్రకటించిన జాబితాలో గోషామహల్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని మజ్లిస్ పార్టీ నిర్ణయిస్తుందని, అందుకే ప్రకటించలేదని ఆరోపించారు. ఇక్కడి అభ్యర్థిని సీఎం కేసీఆర్ నిర్ణయించరన్నారు. 2018లోను మజ్లిస్ పార్టీయే అభ్యర్థిని నిర్ణయించిందన్నారు.