కాంగ్రెస్‌ కార్యకర్తలు కష్టపడి.. రేవంత్‌ను సీఎం చేయాలా..?: రాజగోపాల్‌రెడ్డి

-

తెరాసలోకి 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు ఎవరూ మాట్లాడలేదని.. వారిపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తాను ప్రజాస్వామ్యబద్ధంగానే రాజీనామా చేసి.. భాజపాలోకి వెళ్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డి దిల్లీలో మాట్లాడారు.

‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సీఎల్పీ నాయకుడికి సహకరించా. ఈ మూడున్నరేళ్లుగా మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో పోరాడా. 2014 తర్వాత పార్టీ పదవులు ఇవ్వకపోయినా కష్టపడ్డా. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. నేను ఒక గుర్తుపై గెలిచి.. మరో పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగాలనుకోవడం లేదు. నేను ప్రజాస్వామ్యబద్ధంగానే రాజీనామా చేసి.. భాజపాలోకి వెళ్తున్నాను. ప్రధాని మోదీ వల్లే దేశాభివృద్ధి సాధ్యమని బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

‘‘మునుగోడు ప్రజలు నాపై ఎన్నో ఆశలతో గెలిపించారు. నియోజకవర్గంలో తెరాస ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుందని మునుగోడులో రోడ్లేస్తున్నారు.. సర్వేలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులనే కలవరు. ఎమ్మెల్యేలు చేయాల్సిన పనులు, కార్యక్రమాలను కూడా జిల్లా మంత్రే చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ను అడిగినా మునుగోడును పట్టించుకోలేదు. అప్పట్లో నా పదవి త్యాగం చేస్తా.. నియోజకవర్గానికి నిధులివ్వండని కోరా. నేను పోటీ కూడా చేయను.. తెరాస అభ్యర్థినే గెలిపిస్తానని చెప్పాను. నా డబ్బుతో మునుగోడులో అనేక కార్యక్రమాలను చేపట్టా. నా తల్లి పేరుతో ఉన్న ఫౌండేషన్‌ నుంచి సేవా కార్యక్రమాలను చేస్తున్నా. నేను ఎమ్మెల్యేగా కొనసాగేందుకు ఇంకో ఏడాదిన్నర కాలం ఉంది. మునుగోడు ప్రజల సమస్యల పరిష్కారానికే రాజీనామా ప్రకటించాను’’ అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version