భారతీయ సంప్రదాయాలే మన శక్తి కేంద్రాలు… కానీ నేటి యువత దిశ తప్పుతోందన్న ఆవేదనతో సూపర్‌స్టార్ రజనీకాంత్ గళం విప్పారు. పాశ్చాత్య పోకడలను గుడ్డిగా అనుసరిస్తూ, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని విస్మరిస్తున్న యువతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆయన భార్య లత నిర్వహించిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రజనీ తన భావాలను బహిరంగంగా పంచుకున్నారు.

“ఈ మొబైల్ యుగంలో యువత కాదు, కొంతమంది పెద్దలు కూడా మన దేశ గొప్పతనాన్ని మరచిపోతున్నారు. ఇది మన సంస్కృతి పట్ల అవగాహన లోపాన్ని సూచిస్తోంది. పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడమే కాదు, మన మూలాలను విడనాడడం అనర్థానికి దారి తీస్తుంది,” అని తీవ్రంగా హెచ్చరించారు. తన భార్య లత చేపట్టిన ఈ సాంస్కృతిక కార్యక్రమం ద్వారా యువతలో అవగాహన పెంచే ప్రయత్నం జరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు రజనీకాంత్. “భగవంతుడి ఆశీస్సులతో ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
విదేశీయులు మన దేశ సంస్కృతిని ఆశ్రయించడాన్ని ప్రస్తావించిన రజనీకాంత్, “వారు యోగా, ధ్యానం వంటి భారతీయ సంప్రదాయాల నుంచి మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. మన దేశం వారికో ఆదర్శమవుతోంది, కానీ మన యువత మాత్రం అదే దారిని విస్మరిస్తోంది” అని చింతించారు.
ఇంతకీ, రజనీకాంత్ ప్రస్తుత సినిమా సంగతుల విషయానికి వస్తే – ఆయన ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ రూపొందిస్తున్న “కూలీ” చిత్రంలో నటిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఆగస్టు 14న విడుదల కానుంది.