రామచంద్ర యాదవ్.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పుంగనూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి కాలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులతో వివాదం జరిగింది. మంత్రి అనుచరులు యాదవ్ ఇంటిపై దాడిచేసిన ఘటన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే పనులకు ప్రాధాన్యం ఏర్పడింది. జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు.. తాజాగా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు పత్రికల్లో కోట్ల రూపాయలు వెచ్చించి ప్రకటనలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో కూడా ఆయన హడావిడి ఓ రేంజ్ లో ఉంది.
పోటీచేయాలనుకుంటే జనసేన నుంచే పోటీచేయవచ్చు.. లేదా పార్టీ మారాలనుకుంటే తెలుగుదేశం పార్టీలోనైనా చేరొచ్చు. భారతీయ జనతాపార్టీ పెద్దలతో సన్నిహిత పరిచయాలున్నాయి కాబట్టి బీజేపీవైపైనా మొగ్గు చూపొచ్చు. కానీ అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోకుండా కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు మొగ్గుచూపడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే.. రామచంద్ర యాదవ్ ఏపీలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆ పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ… సంక్షిప్తంగా బీసీవై పార్టీ. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ సాయంత్రం ప్రజా సింహగర్జన సభ నిర్వహించారు. ఈ సభలో రామచంద్రయాదవ్ తన పార్టీ పేరును ప్రకటించారు.
ఈ సభకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, ఢిల్లీ వర్సిటీ ఫ్రొఫెసర్, బీసీ ఉద్యమకారుడు సూరజ్ మండల్ తదితరులు హాజరయ్యారు. ఈ సభలో రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో బీసీవై పార్టీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కొత్త రాజకీయ ప్రస్థానం మొదలవ్వాలని అన్నారు.