పీకేతో ఓకే.. కేసీఆర్ “డ‌బుల్” స్ట్రాటజీ.. అసెంబ్లీ ఎన్నికలకు సీక్రెట్ ఎజెండా..?

-

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హాట్ టాపిక్ గా నిలిచారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఔరా..ఇది నిజమేనా.. అని ముక్కున వేలు వేసుకునేలా దిమ్మతిరిగేలా షాక్ ఇస్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతూనే..అదే కాంగ్రెస్‌ను ఓడించేందుకు పీకే అంగీకరించారని వస్తున్న వార్తలే పెను సంచలనంగా మారాయి. తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పీకే..నువ్వు మామూలోడివి కాదంటూ అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్ నేతలే కామెంట్లు చేస్తున్నారు. అయితే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు విశ్లేషకులు. భవిష్యత్ చిత్రపటం కనిపించినందునే కేసీఆర్ ఈ సాహసోపేత ఒప్పందానికి ఒప్పుకున్నారని పేర్కొంటున్నారు.

కాంగ్రెస్‌లో చేరేందుకు ఇటీవల సోనియా, ఇతర సీనియర్ నేతలతో పీకే వరుస సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికలకు సంబంధించి పార్టీ పెద్దలకు ఒక స్ట్రాటజీని కూడా అందించారు. కాంగ్రెస్‌లో చేరాలంటే ఆయా పార్టీలతో కుదుర్చుకున్న ఎన్నికల వ్యూహ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని సోనియాగాంధీ కండీషన్ పెట్టారని కూడా వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌లో ఉంటూ ఇతర పార్టీలకు పని చేయడం కుదరదని తేల్చిచెప్పినట్లుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఇతర పార్టీలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ఏం చేస్తారన్నది చర్చగా మారింది. మమతాబెనర్జీ, జగన్, స్టాలిన్, కేసీఆర్ వంటి వారితో పొత్తు తెంచుకుంటారా? అన్న చర్చలు జోరుగా సాగాయి.

అదే సమయంలో.. పీకే కాంగ్రెస్‌లో చేరితే ఆ పార్టీని కాదని టీఆర్ఎస్‌కు ఎలా పనిచేస్తారన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇందుకు కేసీఆర్అంగీకరిస్తారా? సోనియా ఒప్పుకుంటారా? అన్న విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. కాంగ్రెస్‌లో చేరిన పీకేతో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయించుకోవడం ఎలా? అన్న మీమాంసలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌లో ఉందని పార్టీ నాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో పేర్కొన్నారు. కానీ..ఉరుములేని పిడుగు పడ్డట్లుగా శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన పీకే.. సీఎం కేసీఆర్‌తో సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

రోజంతా ముఖ్యమంత్రి కేసీఆ‌ర్‌తో భేటీ కావడం, వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తోనే కలిసి పనిచేస్తానని పీకే స్పష్టం చేసినట్లు సమాచారం. ఇందుకు కేసీఆర్ కూడా ఆమోదించినట్లుగా తెలుస్తోంది. ఆదివారం కూడా ఈ చర్చలు సాగనున్నాయి. అయితే.. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతూనే టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తానని చెప్పడమే ఇప్పుడు సంచలనానికి దారితీసింది.

కాంగ్రెస్ నేతల వాదన మాత్రం భిన్నంగా ఉంది. ‘మిషన్ కాంగ్రెస్’ వ్యూహంలో భాగంగానే పీకే హైదరాబాద్ వచ్చారని, కాంగ్రెస్ సీనియర్ నేతలు, అసంతృప్త నేతలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారని చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనూ పీకే మాట్లాడినట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

మొత్తంగా ఈ పరిణామాలను చూస్తుంటే.. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే.. కేంద్రంలో పొత్తు..రాష్ట్రంలో పోరు అన్న రీతిలో ఉండొచ్చని అంటున్నారు. అయితే.. కేసీఆర్ వ్యూహ చతురతును దగ్గరుండి గమనించినవారు మరోలా స్పందిస్తున్నారు. పీకే ఇచ్చిన స‌ర్వే నివేదిక‌లో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డ‌యినందునే ఆయ‌న పీకేతో ప‌ని చేసేందుకు ఒప్పుకున్నార‌ని చెబుతున్నారు.

వచ్చే లోక్ స‌భ‌ ఎన్నికల వరకు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి కేసీఆర్ సమదూరం పాటిస్తారని, ఫలితాలకు అనుగుణంగా కాంగ్రెస్ లేదా బీజేపీకి మద్దతు ఇవ్వొచ్చని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఢోకా లేనందున కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకపోవచ్చునని కూడా చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ టీఆర్‌ఎస్ అదిపెద్ద పార్టీగా నిలిచి..హంగ్ వస్తే కాంగ్రెస్ తో జట్టుకట్టడం ఖాయమని, ఒకవేళ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌వ‌చ్చున‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు ఇప్పటి నుంచే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ని చెబుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే పీకేతో ఎన్నికల వ్యూహాన్ని కొనసాగించేందుకు కేసీఆర్ అంగీకరించి ఉండొచ్చని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version