రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నీట మునిగింది. శుక్రవారం కురిసిన కుండపోత వర్షంతో నగరం అతలాకుతలమైంది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు కుమ్మేయడంతో నగరం తడిసిముద్దయింది. మూడు గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5–8 గంటల మధ్య అత్యధికంగా ఆసిఫ్‌నగర్‌లో 15.1 సెంటీ మీటర్ల మేర భారీ వర్షపాతం నమోదైంది. ఖైరతా బాద్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనూ 12 సెం. మీ.కి పైగా వర్షం కురిసింది.
భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లపై, కాలనీల్లో వరదనీరు చేరింది. సుమారు వంద సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభిం చింది. వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకొని అవస్థలు పడ్డారు. వరద నీటిలో వాహనాలు నిలిచిపోయి ఇబ్బందుల పాలయ్యారు. రాత్రి ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. వర్ష బీభత్సానికి పలుచోట్ల విద్యుత్‌తీగలు తెగిపడి కొన్నిగంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మూతలు లేని మ్యాన్‌హోళ్ల వద్ద వరద నీరు సుడులు తిరిగింది. పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు స్థానికులు నానా యాతన పడ్డారు. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు లోతట్టు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో భారీగా నిలిచిన వరదనీటిని తొలగించేందుకు సహాయకచర్యలు చేపట్టాయి.