ఆర్టీసీకి సరకు రవాణా ద్వారా ఆదాయం రావాలి కానీ రావడం లేదు. కొన్ని ముఖ్యమయిన రూట్ల ద్వారా కూడా ఆదాయం రావాలి కానీ రావడం లేదు. ఇక డిపోలను ఆధునికీకరించి షాపింగ్ క్లాంప్లెక్సులుగా మార్చి ఆదాయం తెచ్చుకోవాలని ఆశించినా, అవి కూడా పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపు ఒక్కటే మధ్యే మార్గం అయింది. కానీ సంస్థ బతికేందుకు లేదా సంస్థను బతికించేందుకు ఇదొక్కటే ప్రధానమయిన పరిష్కారం అని భావిస్తే ముందున్న కాలంలో ఛార్జీల బరువుకు తూగలేక పల్లె జనం మళ్లీ ఎప్పటిలానే షేర్ ఆటోలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఇప్పటికే ఈ తరహా ప్రత్యామ్నాయ వాహనాలు చాలా అందుబాటులో ఉన్నాయి. అందుకే చాలా మార్గాలలో ఆక్యుపెన్సీ రేట్ అన్నది ఆర్టీసీకి ఆశించిన విధంగా రావడం లేదు అన్నది వాస్తవం.
ఛార్జీలు పెరిగిన ప్రతిసారీ వివాదాలు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం నుంచి వాదన ఒక విధంగా, విపక్ష పార్టీల నుంచి వాదన మరో విధంగా వస్తోంది. దీంతో పరస్పర భిన్న వాదనల కారణంగా ప్రజలకు జరిగే మేలు మాత్రం ఏంటన్నది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. వాదనలు అన్నవి రాజకీయ ఉద్దేశాలను ఆపాదించుకుని ఉండడంతో సమస్యలు అపరిష్కృతం అవుతున్నాయన్నది ఓ వాస్తవం. కనుక సమస్యలు పరిష్కారానికి నోచుకోవాలంటే ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలి లేదా ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి. ఇవేవీ చేయకుండా నష్టాలున్నాయన్న వాదనతో ఛార్జీలు పెంపు ఎప్పటికప్పుడు చేయడం కూడా సబబు కాని చర్యే! ఈ దశలో విపక్ష పార్టీ టీడీపీ స్పందిస్తోంది.
ఆర్టీసీ విషయమై సామాన్యులకు ఛార్జీల పెంపు భారంగానే మారనుంది అని దీనిపై సత్వరమే పునరాలోచన చేయాలని టీడీపీ విన్నవిస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డెక్కి నిరసనలు చేస్తోంది. అయితే కరోనా కారణంగా చాలా నష్టపోయిన ఆర్టీసీని ఆ పాటి కూడా గట్టెక్కించలేకపోతే ఎలా అన్న వాదన కూడా ప్రభుత్వం నుంచి వస్తోంది. అందుకే ఛార్జీల పెంపు అనివార్యమే అయిందని ప్రభుత్వం అంటోంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఛార్జీల పెంపు అన్నది ఇప్పుడొక చర్చకు తావిస్తున్న అంశం. పెరుగుతున్న డీజిల్ ధరలు వీటితో పాటు పెరుగుతున్న నిర్వహణ వ్యయం కారణంగానే ఏటా తాము నష్టాలకు ఓర్చాల్సి వస్తోందని యాజమాన్యం అంటోంది.
ఛార్జీల పెంపు తమకు ఇష్టం లేకపోయినా ఈ సారి తప్పక చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తన వాదనగా వినిపిస్తోంది. దీనిపై అనవసర రాద్ధాంతం వద్దని కూడా ఆర్టీసీ యాజమాన్యం హితవు చెబుతోంది. సంస్థకు ఆదాయం వచ్చే మార్గాలు తగ్గిపోయాయని, ఇదివరకు కన్నాఇప్పుడు ఎన్ని స్కీంలు పెట్టినా ప్రయివేటు ఆపరేటర్ల పోటీ విపరీతంగా ఉన్న కారణంగా ఆర్టీసీకి రావాల్సినంత ఆదాయం కూడా రావడం లేదు అని యాజమాన్య వర్గాలు అంటున్నాయి. కనుక బయట ఉన్న పోటీ దృష్ట్యా తాము పండగలకూ, పబ్బాలకూ ఆఫర్లు ప్రకటించినా కూడా ఆదాయం మాత్రం ఆశించిన విధంగా పెరగడం లేదు అని వాపోతున్నాయి సంబంధిత వర్గాలు.
రోజూ ఏపీఎస్ ఆర్టీసీలో ప్రయాణం చేసేవారు 65 లక్షల మంది.
కనీస భారం రూ10/-, సగటు భారం 20/- అనుకున్నా రోజుకి 13 కోట్లు.
సంవత్సరానికి భారం కనీసం 4,745 కోట్లు.
– వేమలి చైతన్య బాబు, తెలుగు యువత అధ్యక్షులు, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం.
పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని టీడీపీ కోరుతోంది. దీని వల్ల సామాన్యులకు భారమేనని చెబుతోంది. అయితే తాము డీజిల్ సెస్ మాత్రమే విధించామని ఆర్టీసీ యాజమాన్యం అంటోంది. నష్టాల నివారణకు తాము ఆ పాటి ఛార్జీలు పెంచడం తప్పని సరి అని కూడా చెబుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై పెద్ద చర్చే జరుగుతోంది. వాస్తవానికి ఎప్పటి నుంచో ఛార్జీలు పెంచాల్సి ఉన్నా ఎప్పటికప్పుడు తమ నిర్ణయం వాయిదా వేసుకుంటూ వస్తున్నామని, తాజా పరిణామాల నేపథ్యంలో పెంచక తప్పలేదని ఆర్టీసీ యాజమాన్యం తనదైన వివరణ ఇస్తోంది.