రేవంత్ Vs కవిత: ట్విట్టర్ లో మాటల యుద్ధం

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గెలుపు ధీమాతో ఉన్న అధికార బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. 119 స్థానాలకు  115 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది.  మరోవైపు  బీజేపీ, కాంగ్రెస్ లు కూడా వ్యూహ రచనలలో బిజీబిజీగా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులేస్తోంది. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. అధికార పార్టీలోని అసమ్మతి నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది. ఈ తరుణంలో బీఆర్ఎస్  అధిష్టానం అనుగ్రహం కోల్పోయిన అసమ్మతి నేత తుమ్మల నాగేశ్వరరావు తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పెద్దలు ఆయనతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బెంగళూరు వెళ్లినట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఈ పర్యటనపై అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శలు వెల్లువెత్తుతుంటే. మరోవైపు ఈ విషయమై.. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది.   తొలుత బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ముందు ఎమ్మెల్సీ కవిత ట్విట్ చేస్తూ.  “అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు.. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం..” అంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయిన ఫోటోను పోస్ట్ చేశారు. 

ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవిత ట్విట్ కు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చారు. “గల్లీలలో సవాళ్లు.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వీడ్కోలు.. ఇది కేసీఆర్ మ్యాజిక్.  జగమెరిగిన నిక్కర్.. లిక్కర్.. లాజిక్కు..” అంటూ ప్రధాని మోడీ, కెసిఆర్ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇలా కవిత, రేవంత్ రెడ్డి ల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version