బీఆర్ఎస్ నాయకత్వంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మగతనం అంటే ఎలక్షన్లు గెలవడం కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అని కేటీఆర్ చెప్పారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కదన భేరీ సన్నాహాక సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి జేబు దొంగలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టికి 90 రోజులు అవుతుంది. మరో 10 రోజులు అయితే వంద రోజులు పూర్తువుతుంది. వంద రోజుల్లో చాలా చేస్తానని రేవంత్ చెప్పారు. అధికారంలోకి రాగానే రూ. 15 వేలు రైతుబంధు వేస్తా అన్నాడు. రైతు భరోసా అన్నాడు కానీ భరోసా లభించలేదు. రైతులు మోసపోయి ఓట్లు వేశామని బాధపడుతున్నారు. కేసీఆర్ ఇచ్చే రైతుబంధు కూడా పడకపాయే కదా అని రైతులు అనుకుంటున్నారు. రేవంత్‌కు రైతుబంధు ఇచ్చే తెలివి కూడా లేదని రైతులు చర్చ పెడుతున్నారు. రాష్ట్రంలో ఉండే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా.. ఆ ఫైలుపై డిసెంబర్ 9న సంతకం చేస్తానని రేవంత్ అన్నాడు. మరి ఎప్పుడు రుణమాఫీ చేస్తావు..? అని కేటీఆర్ నిలదీశారు.