తెర వెనుక చక్రం తిప్పుతున్న రేవంత్‌రెడ్డి…?

-

తెలంగాణ కాంగ్రెస్ లో మిగిలిన నేతల కంటే ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరున్న‌ యువనేత రేవంత్‌రెడ్డి కి ఎలాంటి క్రేజ్ ఉందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిన రేవంత్ రెడ్డికి ఇతర పార్టీల్లో కూడా అభిమానులు ఉండటం విశేషం. ఇక తెలుగుదేశం, కాంగ్రెస్ ఇమేజ్‌తో పాటు తెలంగాణలో సీఎం కేసీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లంతా రేవంత్ రెడ్డికి వీరాభిమానులుగా మారుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ అసెంబ్లీలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని భావించిన కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ను ఓడించే వరకు నిద్ర పోలేదు.

అయితే అనూహ్యంగా నాలుగు నెలలకే ఈ యేడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌స‌భ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచి కేసీఆర్‌కు మళ్ళీ కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఇక ఇప్పుడు రేవంత్ ముందున్న టార్గెట్ తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు. టీ.కాంగ్రెస్ పీఠం కోసం ఇప్పటికే ఆ పార్టీలో సీనియర్ నేతలు కాచుకుని కూర్చుని ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, వి హనుమంత రావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలు ఈ పదవి తమకు ఎప్పుడు వస్తుందా ? అని ఎన్నో ఆశలతో ఉన్నారు.

రేవంత్ వ‌ల‌స వ‌చ్చాడ‌ని.. జూనియ‌ర్ అని ఆయ‌న‌కు టీ పీసీసీ ప‌ద‌వి ఎలా ? ఇస్తార‌ని పార్టీలోనే చాలా మంది నేత‌లు బ‌హిరంగంగానే వ్య‌తిరేకిస్తున్నారు. అయితే ఈ తంతు గ‌మ‌నిస్తోన్న రేవంత్ కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల‌ను త‌నకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. జానారెడ్డి, దామోదర రాజనరసింహ, షబ్బీర్ అలీతో పాటు పలువురు సీనియర్లు తనకు మద్దతుగా ఉండేలా రేవంత్ తెర వెన‌క చ‌క్రం తిప్పుతున్నార‌ట‌.

ఇటీవ‌ల త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన మ‌ల్కాజ్‌గిరి ప్ర‌జ‌ల కోసం ఆయ‌న ఏర్పాటు చేసిన కార్యాల‌యం ప్రారంభోత్స‌వానికి ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు హాజ‌రై రేవంత్‌కు తాము వెన‌క ఉన్నామ‌న్ని భ‌రోసా అయితే ఇచ్చారు. వీళ్లంతా టీ పీసీసీ ప‌ద‌వి విష‌యంలో రేవంత్‌కే స‌పోర్ట్ చేస్తున్నార‌న్న ఓ అభిప్రాయం అయితే తెలంగాణ కాంగ్రెస్‌లో బ‌ల‌ప‌డింది. అయితే ఆ పార్టీలో ఎప్పుడు ఎవ్వ‌రిని న‌మ్మ‌లేం. చివ‌ర‌కు జ‌గ్గారెడ్డి లాంటి వాళ్లు కూడా త‌మ‌కు టీ పీసీసీ ప‌ద‌వి కావాలంటున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో రేవంత్ ఎత్తులు ఎంత వ‌ర‌కు పార‌తాయో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version