హడావిడి తగ్గించిన రేవంత్ సాగర్ లో ప్రచారంతో స్పీడ్ పెంచుతారా ?

-

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి అంటేనే కేడర్ కాస్త జోష్ ఊపు ఉంటుంది. పార్టీ అభ్యర్ది బరిలో ఉన్నాడంటే ఇక పార్టీ బాధ్యతలు అప్పగించినా లేకున్నా దూకుడుగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తారు. దుబ్బాక నుంచి గ్రేటర్,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వరకు పార్టీలో ఇతర నేతలతో సబంధం లేకుండా ముందుండి ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎఎన్నిక ఊపు వచ్చే సరికి రేవంత్ సైలెటయ్యారు. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అయితే కరోనా సోకడంతో హోం ఐసోలేషన్ లో ఉన్న రేవంత్ సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్న సాగర్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా లేదా అన్న ఆసక్తి నెలకొంది.

సాగర్ ఉపఎన్నిక లో రేవంత్ చొరవ తీసుకుని సాగర్ వెళ్లి ప్రచారం చేయడమే కానీ జానారెడ్డి కానీ మరో సీనియర్ నేత కానీ ప్రచారానికి ఆహ్వానించే పరిస్థితి లేదు. నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పోటీ ఉంది. రాజకీయ సమీకరణాల రీత్యా.. అక్కడ జానారెడ్డి కాస్త ముందున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా పెద్ద ఎత్తున జనం వస్తారని.. ఒక వేళ గెలిచినా ఆ క్రెడిట్ ఆయనకే వెళ్తుందని కాంగ్రెస్‌లోనే కొంత మంది లెక్కలేస్తున్నారు. సాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ మార్పు ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి పాత్ర వీలైనంత తక్కువ ఉండేలా చూడాలని కాంగ్రెస్ సీనియర్లు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న నేతలు ఒక్కోక్కరుగా పార్టీ వీడుతున్నారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరిపోగా..మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ ని వీడారు. రేవంత్ కి ఒక్కో నేత దూరమవుతుండటంతో రేవంత్ వర్గం బలహీనపడుతుందన్న ప్రచారం సైతం పార్టీలో జరుగుతుంది. కానీ ఎవరు అవునన్న కాదన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీకి మంచి క్రౌడ్ పుల్లర్ గా మాస్ ఇమేజ్ ఉన్న నేతగా పేరుంది.

మరో వైపు క‌రోనా నుండి కోలుకుంటున్న రేవంత్ రెడ్డి సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌బోతున్నారు అన్న చర్చ మొదలైంది. ఏప్రిల్ 8 నుండి వారం పాటు రేవంత్ అక్క‌డే మ‌కాం వేయ‌నున్నారు అని.. ప్ర‌తి మండ‌లాన్ని క‌వ‌ర్ అయ్యేలా ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హించ‌బోతున్నారు అని రేవంత్ అనుచరులు చెబుతున్నారు. ఏ చోట ప్ర‌చారం చేయాల‌నే అంశంపై జానారెడ్డి, రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే చ‌ర్చించిన‌ట్లు చెబుతున్నారు. కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న రేవంత్ మళ్ళీ సాగర్ ప్రచారంతో దూకుడు పెంచుతారా అన్నది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version