పాలకుర్తిలో హైటెన్షన్..రేవంత్-షర్మిల ఒకేసారి!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో బి‌జే‌పి చీఫ్ బండి సంజయ్ విడతల వారీగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సైతం పాదయాత్ర చేస్తున్నారు. ఇటు ఏపీలో టి‌డి‌పి నేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఇక ఇటీవల తెలంగాణలో పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు. ఇలా పాదయాత్రలు నడుస్తున్నాయి.

అయితే ప్రస్తుతం తెలంగాణలో రేవంత్, షర్మిల పాదయాత్రలు కొనసాగుతున్నాయి. ఇరువురు పాదయాత్రలు చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ..కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇలా తమదైన శైలిలో దూసుకెళుతున్న రేవంత్..షర్మిల పాదయాత్రలు ఒకేసారి పాలకుర్తిలోకి ఎంటర్ కానున్నాయి. నేటి సాయంత్రానికి రేవంత్ రెడ్డి, షర్మిల పాదయాత్రలు పాలకుర్తి చేరుకుంటాయి. ఇక రేపు, ఎల్లుండి పాలకుర్తిలో రేవంత్, షర్మిల పాదయాత్రలు నిర్వహించనున్నారు.

అయితే ఇలా ఇద్దరు కీలక నేతల పాదయాత్రలు ఒకే నియోజకవర్గంలో ఉండటంతో టెన్షన్ వాతావరణం ఉంది. ఇక వీరు పాదయాత్రలు ఒకే రూట్ లో ఉన్నాయా? వేరు వేరు రూట్‌ల్లో ఉన్నాయా? అనేది క్లారిటీ లేదు…కానీ రెండు పాదయాత్రలు క్లాష్ అవ్వకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే రేవంత్ పాదయాత్రపై షర్మిల విమర్శలు చేశారు..రేవంత్ టి‌డి‌పి నుంచి వచ్చిన వ్యక్తి అని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని, కారులో తిరుగుతూ పాదయాత్ర అంటున్నారని ఎద్దేవా చేశారు.

కానీ రేవంత్ ఎక్కడా కూడా షర్మిల పై కామెంట్ చేయలేదు. మరి ఇప్పుడు ఒకేసారి పాలకుర్తిలో పాదయాత్ర జరగనుంది. ఈ క్రమంలో రేవంత్..షర్మిలని టార్గెట్ చేస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే గతంలో పాలకుర్తి నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా గొడవ చోటు చేసుకుంది. బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలోనే బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version