ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతుంది. కోవిడ్ – 19 వైరస్ చేస్తున్న అలజడికి పెద్ద దేశం, చిన్న దేశం అన్న తారతమ్యాలు ఏమీ లేకుండా విలవిల్లాడి పోతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20,96,573 పాజిటివ్ కేసులు నమోదవగా.. సుమారు 1,35,662 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచం మొత్తం లెక్కలు ఈ రేంజ్ లో ఉంటే… అన్ని విషయాలలోనూ అగ్రస్థానం కోసం పోటీపడే ప్రపంచ పెద్దన్న అమెరికా 6,44,348 పాజిటివ్ కేసులతో 28,554
మరణాలతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది! ఒక్క అమెరికాలోనే సరాసరి రోజుకు వెయ్యి నుంచి పదిహేనువందలవరకూ మరణాలు నమోదవుతుండటంతో… అగ్రరాజ్యం విలవిల్లాడిపోతుంది.
ఈ క్రమంలో ఈ విషయాన్నే తనదైన శైలిలో చెప్పారు రాం గోపాల్ వర్మ! ప్రస్తుతం అమెరికాలో కరోనా వల్ల జరుగుతున్న రోజువారీ మరణాలను చూస్తుంటే… 9/11 ఎటాక్ ప్రతీ రోజూ జరుగుతున్నట్లుగా ఉందని ట్వీట్ చేశాడు రాం గోపాల్ వర్మ. ఇదే క్రమంలో.. ప్రస్తుతం నమోదవుతున్న మరణాల సంఖ్యను చూస్తుంటే.. కరోనా వైరస్ ముందు ఒసామా బిన్ లాడెన్ ఒక కిండర్
గార్డెన్ కిడ్ అని ట్వీటారు! ఈ విషయాన్ని ఎవరు ఎలా అర్ధం చేసుకుంటే “నాకేంటీ” అనే సమాధానంతో ముందుకు వెళ్లే వర్మ.. తాజాగా పెట్టిన ఈ ట్వీట్ కూడా ఆ కోవలోదే అనడంలో సందేహం ఉండకపోవచ్చు!
ప్రపంచంలో జరిగే ఏ విషయంపై అయినా తనదైన శైలిలో స్పందించే వర్మ.. తాజా అమెరికా కరోనా వైరస్ మరణాలపై ఇలా స్పందించడం పెద్ద విషయమేమీ కాకపోయినా… స్పందించిన విధానంలో మాత్రం చాలా లోతైన అర్ధమే దాగి ఉందని వర్మ అభిమానులు వెనకేసుకు వస్తుండటం నిత్యం జరిగే కొసమెరుపే కదా! ఒసామా బిన్ లాడెన్ అంటే మనిషి కాబట్టి, అనుకున్నదే తడువుగా చంపగలిగారు..
మరి కరోనా వైరస్ ను ఎందుకు కిల్ చేయ్యలేకపోతున్నారు అనేది వర్మ మెసేజ్ లో సారాంశమా? లేక కరోనాను సృష్టించిందని విమర్శలు ఎదుర్కొంటున్న చైనాను ఎందుకు వదిలేస్తున్నారు? అనేది మరో నిగూడార్ధమా? అదీగాక… వ్యక్తులను చంపినంత ఈజీ కాదు వైరస్ లను చంపడం అనే అర్ధమా? ఏమో… వర్మమే ఎరుకవ్వాలి!!
Considering the death toll per day in the US, there is a 9/11 attack happening every day there ???OSAMA BIN LADEN seems like a kindergarten kid compared to the CORONAVIRUS ???
— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2020