కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు. కంటికి కనిపించని ఈ వైరస్ ఏ రూపంలో తమ వద్దకు వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కర్ణాటకకు చెందిన కొందరు పరిశోధకులు ఓ పాత ఫ్రిజ్‌నే డిసిన్ఫెక్షన్ చాంబర్‌గా మార్చేశారు. ఈ పరికరానికి జీరో కోవ్ అని పేరు పెట్టారు. కర్ణాటకలోని సూరత్‌కల్‌లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీకే) కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ అరుణ్ ఎం ఇస్లూర్, పరిశోధక విద్యార్థి సయ్యద్ ఇబ్రహీంతో కలిసి దీనిని డిజైన్ చేశారు.
అందులో ఎలాంటి వస్తువులను ఉంచినా.. వాటిపై ఉన్న క్రిములను ఆ పరికరం నాశనం చేస్తోందని ఇస్లూరు చెప్పారు. వస్తువులను ఫ్రిజ్‌లో ఉంచి 15 నిమిషాల సేపు ఆన్‌లో ఉంచితే వాటిపై ఉన్న క్రిముల 99.9 శాతం మేర నశిస్తాయని తెలిపారు. పుస్తకాలు, కరెన్సీ నోట్ల, కవర్లు, కూరగాయలు, పండ్లు.. ఇలా ఏ వస్తువును దీంట్లో ఉంచినా ఇన్ఫెక్షన్ రహితంగా మారతాయన్నారు. తద్వారా కరోనాకు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు.
అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి నివారణకు మందు లేకపోవడంతో.. ప్రభుత్వాలు నియంత్రణ చర్యలపై దృష్టి సారించారు. కరోనా వ్యాప్తిని అడ్డకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరుతున్నాయి.