రాజకీయాల్లో మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్ నాయకురాలు..ప్రత్యర్ధులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. ప్రతిపక్షంలో ఉండగానే తనదైన శైలిలో ప్రత్యర్ధి పార్టీ టీడీపీపై విరుచుకుపడ్డారు. ఇక అధికారంలోకి వచ్చాక ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అటు చంద్రబాబుని వదిలి పెట్టడం లేదు..ఇటు జనసేన నేత పవన్‌ని వదిలి పెట్టడం లేదు. మంత్రి అయ్యాక మరింత ఎక్కువగా వారిపై విమర్శలు చేస్తున్నారు. పరుష పదజాలంతో వాడుతూ తిడుతున్నారు.
ఇప్పటికే పలుమార్లు బాబు, పవన్ ఓటములపై సెటైర్లు వేస్తూ..ఎగతాళి చేస్తూ వచ్చిన రోజా..తాజాగా చిరంజీవి ఓటమిపై కూడా కామెంట్ చేశారు. మొదట బాబుపై విరుచుకుపడిన రోజా..కుప్పంలో బాబు కూసాలు కదిలాయని, స్థానిక ఎన్నికల్లో కుప్పం ప్రజలు తంతే హైదరాబాద్ లో పడ్డారని..చంద్రబాబు నాయుడు కాస్త శవాల నాయుడుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో పవన్‌ని సొంత జిల్లా ప్రజలు ఓడించారని కామెంట్ చేశారు.
అదే సమయంలో చిరంజీవి, నాగబాబులని సైతం సొంత జిల్లా ప్రజలు ఓడించారని, పవన్ కళ్యాణ్ ముగ్గురిని టార్గెట్ చేశారు. ఈ ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని, సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారని.. అందరికీ సాయం చేస్తారని కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నమని, అందుకే రాజకీయాల్లో వీరిని ప్రజలు ఆదరించలేదని ఎద్దేవా చేశారు.
అయితే ఎప్పుడు పవన్‌ని విమర్శించే రోజా..ఇప్పుడు చిరంజీవి, నాగబాబుని సైతం టార్గెట్ చేశారు. ఇప్పటికే బాబు, పవన్, లోకేష్ ఓటములపై ఎప్పటికప్పుడు ఎగతాళి చేస్తూ మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు చిరంజీవి, నాగబాబుని టార్గెట్ చేశారు. 2009లో చిరంజీవి పాలకొల్లు నుంచి ఓడిపోయిన విషయం తెలిసిందే. 2019లో నరసాపురం పార్లమెంట్ లో నాగబాబు జనసేన నుంచి ఓడిపోయారు. ఇక పవన్..భీమవరం, గాజువాకల్లో ఓడిపోయారు.
ఈ ఓటములపై సెటైర్లు వేశారు. అయితే చిరంజీవి..జగన్‌తో సఖ్యతగానే ఉంటున్నారు. దీంతో చిరంజీవిని విమర్శించడంపై రోజాపై సొంత పార్టీ వాళ్లే కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ అంటే రాజకీయ ప్రత్యర్ధి కాబట్టి విమర్శించారు..ఇప్పుడు చిరంజీవిని తీసుకురావడం అవసరమా అంటున్నారు. అదే సమయంలో గతంలో రోజా రెండుసార్లు ఓడిపోయారని, రెండుసార్లు గుడ్డిలో మెల్ల అంటూ తక్కువ మెజారిటీలతో గెలిచి బయటపడ్డారని, ఇక నెక్స్ట్ ఎన్నికల్లో నగరిలో రోజాకు ఓటమి ఖాయమని జనసేన శ్రేణులు కౌంటర్లు వేస్తున్నాయి.