శ్రీ సమ్మత్ శిఖర్ జీ పర్వత శ్రేణిని ఝార్ఖండ్ ప్రభుత్వం పర్యటక ప్రాంతంగా ప్రకటించడంపై జైనులు తీవ్ర ఆందోళన చేసిన నేపథ్యంలో కేంద్ర సర్కార్ దిగొచ్చింది. ఆ ప్రాంతంలో ఎలాంటి పర్యటక కార్యాకలాపాలు చేపట్టవద్దంటూ ఝార్ఖండ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.
ఝార్ఖండ్‌లోని గిరిద్ జిల్లాలో పరసనాథ్ హిల్స్‌పై ఉన్న శ్రీ సమ్మత్ శిఖరాజి పుణ్యక్షేత్రాన్ని ఏటా లక్షలాది మంది జైనులు సందర్శిస్తారు. ఈ మందిరాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా మార్చాలంటూ 2018లో కేంద్రాన్ని కోరింది ఝార్ఖండ్ ప్రభుత్వం. 2019లో ఎకో సెన్సిటివ్ జోన్‌గా కేంద్రం ప్రకటించింది కేంద్రం. కానీ ఝార్ఖండ్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జైనులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వారు నిరసన చేపట్టారు. సమ్మత్ శిఖరాజి తీర్థ్‌ను పర్యటక ప్రాంతంగా ప్రకటించడం వల్ల ఆ స్థలం పవిత్రత దెబ్బతింటుందని జైనులు ఆవేదన వ్యక్తం చేశారు.