కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ దారుణంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ ప్యాకేజీని తాము కోరలేదని, ఆ ప్యాకేజీ పూర్తిగా ఫ్యూడల్ భావాన్ని తలపిస్తుందని అన్నారు. రాష్ట్రాలను కేంద్రం బిచ్చగాళ్లుగా భావిస్తుందని ఆరోపించారు. కరోనా లాంటి భారీ విపత్తు వచ్చిందని, ఆదుకోవాలని కేంద్రాన్ని కోరితే.. కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ ప్యాకేజీని పూర్తిగా ఖండిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.
తమకు రావల్సిన పన్నుల వాటాల్లోనే నిధులనే కేంద్రం అందిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. తమకు కొత్తగా కేంద్రం ఇస్తున్నది ఏమీ లేదని తెలిపారు. రుణ పరిమితి పెంపుకు కేంద్రం పెట్టిన నిబంధనలను తాము ఎప్పుడో పాటించామని, ఇప్పుడు కొత్తగా చేసేది ఏమీ లేదని అన్నారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ అసంబద్ధంగా ఉందని అంతర్జాతీయ సంస్థలే తేల్చి చెప్పాయని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి నీటి పంపకాల విషయంలో తాను చిత్తశుద్ధితో ఉన్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని, వారికి అసలు ఏ సమస్యలపై పోరాటం చేయాలో తెలియడం లేదని అన్నారు.