ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉద్ధృతమవుతోంది. ఆర్టీసీ సమ్మె పదో రోజుకు చేరుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. శనివారం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసింది.
ఆయన తుదిశ్వాస విడిచిన కొద్ది గంటల్లోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కండక్టర్ సురేందర్‌గౌడ్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక తాజాగా హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ డిపోలో కండక్టర్‌గా పనిచేసే సందీప్ బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అది గమనించిన తోటి కార్మికులు వెంటనే ఆయన్ను కొండాపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.