ఆమె పేరు దేవి. ఉత్తరభారత దేశంలోని ఓ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో నివాసం ఉంటోంది. 6 నెలల కిందట కుటుంబ పోషణకు రూ.20వేల అప్పు తీసుకుంది. భర్త దినసరి కూలీ. కానీ కరోనా(corona) కారణంగా పనులు జరగడం లేదు. దీంతో ఉపాధి కరువైంది. మరోవైపు తీసుకున్న అప్పు చెల్లించేందుకు మార్గం కనిపించడం లేదు. వంటనూనె, పాలు, పప్పు దినుసులు కొనడం మానేశారు. ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నారు. కేంద్రం నెల నెలా ఇస్తున్న బియ్యం, సరుకులు నెల మొత్తానికి చాలడం లేదు. ముందు ముందు ఇంకా ఎలాంటి దుర్భర పరిస్థితులు వస్తాయోనని వారు ఆందోళన చెందుతున్నారు.
పైన చెప్పింది.. ఓ మారుమూల గ్రామానికి చెందిన కుటుంబం పరిస్థితి. దేశంలో దాదాపుగా 75 శాతం వరకు గ్రామాల్లో పరిస్థితి ఇలాగే ఉందని సర్వేలు చెబుతున్నాయి. కోవిడ్ వల్ల పట్టణ వాసులే కాదు, గ్రామాల్లో నివసించే వారికి కూడా ఉపాధి కరువైంది. మరోవైపు కుటుంబ పోషణ, విద్య, వైద్యం ఖర్చులు.. వెరసి కోవిడ్ మొదటి వేవ్‌లో కన్నా రెండో వేవ్ సమయంలోనే అప్పులు తీసుకునే వారి సంఖ్య మూడింతలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నారు.
ఉపాధి పోగొట్టుకున్నవారు కొందరైతే, వ్యాపారం సరిగ్గా జరగక నష్టాలు వచ్చి దివాళాలు తీస్తున్నవారు కొందరు. కొందరికి పని ఉండడం లేదు. ఇలా దేశంలోని అనేక గ్రామాల్లో ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో వారు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రూ.లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించే బదులు ప్రజల బ్యాంకు ఖాతాల్లోకే ఆర్థిక సహాయం నేరుగా అందేలా చూస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మరి గ్రామీణుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో.. ఆ దేవుడికే తెలియాలి.