ఉక్రెయిన్- రష్యా మధ్య మిలిటరీ యాక్షన్ గా ప్రారంభం అయిన దండయాత్ర పూర్తిస్థాయి యుద్ధంగా మారింది. ఉక్రెయిన్ పై ముప్పేటా దాడి చేస్తూ… ఉక్రెయిన్ పై ఒత్తడి పెంచుతోంది రష్యా. ఇదిలా ఉంటే మాస్కోను కీవ్ ఎదురిస్తూనే ఉంది. ఇప్పటికే రష్యా కొన్ని సరిహద్దు నగరాలను ఆధీనంలోకి తెచ్చుకుంది. కీవ్ , ఖార్కీవ్ నగరాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని రష్యా భావిస్తోంది. మరోవైపు ధీటుగా ఉక్రెయిన్ సేనలు సమాధానం ఇస్తున్నాయి. ఇలా రెండు వైపులా భారీగా సైనికులు, సైనిక సంపత్తిని కోల్పోయాయి ఇరు దేశాలు.
తాజాగా రష్యా యుద్ధంపై అధికారిక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ యుద్ధంలో 1600మంది రష్యన్ సైనికులు గాయపడ్డారని… 217 యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ ధ్వంసం చేసిందని రష్యా పేర్కొంది. 90 ఫిరంగులు, 31 హెలికాప్టర్లు, 30 యుద్ధవిమానాలను కోల్పోయిందని రష్యా. 498 రష్యా సైనికులను కోల్పోయామన రష్యన్ ప్రభుత్వం ప్రకటించింది. 2870 ఉక్రెయిన్ సైనికులు, పౌరులను హతమార్చినట్లు రష్యా వెల్లడించింది. అయితే ఉక్రెయిన్ మాత్రం 6000 మందికి పైగా రష్యన్ సైనికులను హతమార్చినట్లు వెల్లడించింది. తాజాగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం 8వ రోజుకు చేరింది. ఇప్పటికే మొదటి విడత చర్చలు జరిగినా… రెండు దేశాల మధ్య అంగీకారం కుదరలేదు. రెండు దేశాలు కూడా తమతమ డిమాండ్లపై గట్టిగా ఉన్నాయి.