బబితా ఫోగాట్ స్వార్థపరురాలు : సాక్షి మాలిక్

-

నెల రోజులకు పైగా ఢిల్లీలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అగ్ర శ్రేణి రెజ్లర్లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌లు తిరిగి రైల్వేలో విధులకు హాజరయ్యారు. ఈ మేరకు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే వీరు మే 31 నే విధుల్లో చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాము ఆందోళనలు విరమించినట్లు వస్తున్న వార్తలను రెజ్లర్లు ఖండించారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్ల పోరాటం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత, బీజేపీ నేత బబితా ఫోగాట్ సహచర రెజ్లర్ల పోరాటాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించిందని సాక్షి ఆరోపించింది. రెజర్ల ధర్నాలను తన స్వార్థానికి ఉపయోగించుకోవాలని చూసిందని వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

సాక్షి మాలిక్, ఆమె భర్త సత్యవర్ధ్ కడియన్ శనివారం కూడా ఇదే అంశంపై ఓ వీడియో పోస్టు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా చేసేందుకు రెజ్లర్ తరఫున మొదట అనుమతి తీసుకుంది బబితా ఫోగాట్, మరో బీజేపీ నేత తీర్థ్ రాణా అని వెల్లడించారు. కానీ, ఆ తర్వాత వారిద్దరే జంతర్ మంతర్ లో ధర్నా చేయడాన్ని వ్యతిరేకించారని ఆరోపించారు. ఇక్కడ రాజకీయ కారణాలతో ధర్నాలు చేయడం కుదరదని సలహాలు ఇవ్వడం ప్రారంభించారని వివరించారు. ఈ మేరకు సాక్షి, సత్యవర్ధ్ లిఖిత పూర్వక ఆధారాలను కూడా వెల్లడి చేశారు. బబితా, తీర్థ్ రాణా తమ స్వార్థం కోసం రెజ్లర్లను ఉపయోగించుకున్నారని, రెజ్లర్లు ఆందోళనకర పరిస్థితుల్లో ఉంటే వారిద్దరూ ప్రభుత్వ పక్షాన చేరారని సాక్షి మాలిక్ తాజా ట్వీట్ లో ఆరోపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version