సౌదీ అరేబియా ఇప్పుడు భీకరమైన ఇసుక తుఫానుతో అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా ఆ దేశ రాజధాని రియాద్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎత్తైన భవనాలను సైతం కప్పేస్తూ ఆకాశాన్ని తాకేలా దుమ్ము మేఘాలు ఏర్పడ్డాయి. దట్టమైన సుడిగాలులతో రియాద్ ఐకానిక్ స్కైలైన్ పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ భయంకరమైన దృశ్యం నగర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఇసుక తుఫాను కారణంగా సౌదీ అరేబియాలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దుమ్ము , ధూళి కారణంగా వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఎక్కడికక్కడ తమ ఇళ్లకు పరిమితమయ్యారు. బయటకు రావడానికి సాహసించని పరిస్థితి నెలకొంది.
ఈ దుమ్ముధూళితో కూడిన భీకరమైన తుఫాను కేవలం రియాద్‌కే పరిమితం కాలేదు. ఇది జజాన్, ఆసిర్, అల్ బహా, మక్కా , అల్ ఖాసిమ్ ప్రాంతాల మీదుగా కూడా విరుచుకుపడింది. ఈ ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎటు చూసినా దుమ్ము , ధూళి మాత్రమే కనిపిస్తోంది. వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దృశ్యమానత చాలా తక్కువగా ఉండటం వల్ల వాహనదారులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు.