ఆర్మీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. యువత ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ.. ఆదివారం గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నాంపల్లిలోని గాంధీభవన్ ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. అంతేకాకుండా.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దు కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది.
కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే.. నేడు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు వేడుకలు నిర్వహించనున్నారు. అయితే.. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. అంతేకాకుండా తన పుట్టినరోజు వేడుకలు జరుపొద్దని కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను రాహుల్ గాంధీ కోరారు.