దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం ఒక ముగింపునకు వచ్చే సమయం ఆసన్నమైంది! అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు వ్యాజ్యంపై శనివారం ఉదయం 10:30 గంటలకు తుది తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. మధ్యప్రదేశ్, యూపీ, జమ్ము కశ్మీర్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూసివేశారు.
యూపీలో ముందుజాగ్రత్త చర్యగా శనివారం నుంచి సోమవారం వరకూ విద్యాసంస్థలను మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.మరోవైపు గోవా, యూపీ, జమ్ము కశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో 144 సెక్షన్ విధించారు. జమ్ము కశ్మీర్‌లో పరీక్షలు వాయిదా వేసిన అధికారులు శనివారం మద్యం విక్రయాలు ఉండవని డ్రైడేగా ప్రకటించారు.